Water Crisis | మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగత్రలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటిమట్టం వేగంగా తగ్గుతున్నది. కేంద్ర జల సంఘం (CWC) నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా చాలా ప్రధాన జలాశయాల్లో నీటిమట్టం మొత్తం సామర్థ్యంలో 45శాతం తగ్గింది. మార్చి-మే మధ్య సాధారణం కంటే ఎక్కువ రోజులు ఎండలు ఉంటాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో నీటి సమస్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. జలాశయాలు సాగు, తాగునీటికి కీలకం. అయితే, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా నీటి వనరులను అప్పటికే అధికంగా ఉపయోగించడం వల్ల నిల్వలు పడిపోయాయి. కేంద్ర జల సంఘం నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలోని 155 ప్రధాన జలాశయాల మొత్తం సామర్థ్యం 18,080 కోట్ల క్యూబిక్ మీటర్లు కాగా.. ప్రస్తుతం మిగిలింది 8,070 కోట్ల క్యూబిక్ మీటర్ల (BCM) మాత్రమే.
ప్రస్తుత ఉత్తర ప్రాంతంలో జలాశయాల నీటిమట్టం మొత్తం సామర్థ్యంలో కేవలం 25శాతం మాత్రమే ఉంది. ఇందులో పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్‌లో 11 రిజర్వాయర్లు ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ జలాశయాల్లో సాధారణం కంటే వరుసగా.. 36శాతం, 45శాతానికి నీటి నిల్వ పడిపోయింది. అలాగే, పశ్చిమ ప్రాంతంలోని జలాశయాల్లో నీటిమట్టం సామర్థ్యం 55శాతం, మధ్యప్రాంతంలో 49శాతం, తూర్పు ప్రాంతంలో 44శాతం నిల్వలు మాత్రమే మిగిలాయి. జలాశయాల నుంచి నీటిని ఎక్కువగా వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత పారిశ్రామిక రంగం, గృహ అవసరాలకు సరఫరా అవుతున్నది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించేందుకు రెండునెలలకుపైగా సమయం ఉన్నది. ఈ క్రమంలో జలాశయాల్లో నీటిమట్టం తగ్గడంతో రబీ, ఖరీఫ్ మధ్య సాగయ్యే పంటలను ప్రభావితం చేయనున్నది.
దేశంలోని 20 నదీ పరీవాహక ప్రాంతాలలో.. 14 నదీ పరీవాహక ప్రాంతాలలో వాటి సామర్థ్యంతో పోలిస్తే సగం కంటే తక్కువ నీటి నిల్వలు ఉన్నాయి. ఈ నదీ పరీవాహక ప్రాంతాలలో గంగా నది.. దాని క్రియాశీల సామర్థ్యంలో 50శాతం మాత్రమే ఉంది. గోదావరిలో 48శాతం, నర్మదలో 47శాతం, కృష్ణలో 34శాతం నీరు మాత్రమే మిగిలి ఉంది. నదీ వ్యవస్థలు దేశంలోని పెద్ద జనాభాకు నీటిపారుదల, తాగునీరు, జీవనోపాధిని అందిస్తాయి. నీటి మట్టం తగ్గడం ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితం, జీవనోపాధి, వ్యవసాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.