Sandeep Dikshit : ఢిల్లీ (Delhi) లోని మయూర్ విహార్ (Mayur Vihar) ఏరియాలో నాలుగు రోజుల క్రితం 23 ఏళ్ల మహిళ తన మూడేళ్ల కొడుకుతో సహా మ్యాన్‌హోల్‌లో పడి మరణించిన ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఢిల్లీ సర్కారు వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని బీజేపీ (BJP).. ఘటనకు లెఫ్టినెంట్ గవర్నరే బాధ్యుడని ఆప్ (AAP) ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో శనివారం కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ (Sandeep Dikshit) ఘటనా ప్రాంతాన్ని సందర్శించారు.
#WATCH | Congress leader Sandeep Dikshit says, “The incident is very unfortunate…The two parties (BJP and AAP) are busy levelling allegations against each other. They don’t care about the public of Delhi…The elected government and officials should learn something from this… https://t.co/sHCQ3EqhdQ pic.twitter.com/mcOo5Blltt
— ANI (@ANI) August 3, 2024
ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, ఆప్ తీరుపై మండిపడ్డారు. ‘ఆ రెండు పార్టీలకు ప్రజల బాగోగులు పట్టవా..?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ, ఆప్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంలో బిజీ అయిపోయారని విమర్శించారు. ఈ ఘటన నుంచైనా ఢిల్లీ సర్కారు, అధికారులు గుణపాఠం నేర్వాలని ఆయన సూచించారు. ఆప్‌కు ఎన్నికల్లో గెలువాలన్న యావే తప్ప ప్రజల క్షేమం అక్కర్లేదని మండిపడ్డారు.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా 23 ఏళ్ల మహిళ, ఆమె మూడేళ్ల కుమారుడు మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందారు. ఈ విషాద ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. రహదారులపై మోకాళ్లలోతు నీరు చేరింది. ఘాజీపూర్లోనూ రహదారిపై భారీగా వరద నిలిచింది.
అదే సమయంలో తనూజ బిష్త్ అనే మహిళ తన మూడేళ్ల కొడుకు ప్రియాంష్‌ను తీసుకుని కూరగాయల కోసం ఘాజీపూర్‌లోని వారాంతపు సంతకు వెళ్లింది. సంతలో సరుకులు తీసుకొని తిరిగి వచ్చేటప్పటికి రోడ్డుపై భారీగా వరద చేరింది. వరద నీటిలో మ్యాన్ హోల్ తెరుచి ఉన్న సంగతిని గమనించని మహిళ తన మూడేళ్ల కొడుకుతో సహా అందులో పడిపోయింది.
ఘటనా ప్రాంతానికి అర కిలోమీటర్ దూరంలో తల్లీకొడుకు మృతదేహాలు దొరికాయి. మరణించి కూడా ఆ తల్లి తన కొడుకును బిగ్గరగా పట్టుకునే ఉంది. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. కాగా గత మూడు నెలలుగా ఆ మ్యాన్‌హోల్ తెరిచే ఉందని, పలుమార్లు అధికారులకు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే రెండు నిండు ప్రాణాలను తీసిందని మండిపడుతున్నారు.