Mokshagna | నందమూరి కుటుంబ వారసుడిగా, నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడిగా మోక్షజ్ఞ పేరు ఎప్పటి నుంచో టాలీవుడ్లో ఆసక్తికర చర్చలకు కారణమవుతోంది. ఆయన సినీ అరంగేట్రంపై గత కొన్నేళ్లుగా ఎన్నో ఊహాగానాలు వినిపించినా, అధికారికంగా స్పష్టత మాత్రం రాలేదు. అయినా, మోక్షజ్ఞను వెండితెరపై చూడాలనే ఆశతో నందమూరి అభిమానులు ఇప్పటికీ ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు తెరపడే సమయం దగ్గర పడుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని టాక్.
ఇక ఆలస్యం చేయకుండా, సరైన సమయంలో సరైన లాంచ్ ఇవ్వాలన్న ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ తొలి సినిమాకు దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడిని ఫైనల్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. మోక్షజ్ఞ లుక్స్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. గతంలో కాస్త బరువుగా కనిపించిన మోక్షజ్ఞ, ఇప్పుడు పూర్తిగా ఫిట్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మార్పు చూసిన అభిమానులు ఆయన అరంగేట్రం సాధారణంగా ఉండదని ఫిక్స్ అయిపోయారు. స్టార్ కిడ్ అయినప్పటికీ, కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడితో తొలి సినిమా చేయడం ద్వారా బలమైన ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంటుందని అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ అనేక కారణాల వల్ల ముందుకు సాగలేదు. షూటింగ్ మొదలవుతుందనుకున్న ప్రతిసారీ వాయిదాలు పడటం వల్ల అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. అయితే, తాజా పరిణామాలతో ఆ నిరాశకు చెక్ పడే అవకాశం ఉందని టాక్. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, కొత్త ఏడాది ఆరంభంలోనే క్రిష్–మోక్షజ్ఞ సినిమా సెట్స్‌పైకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 2026 ఏడాది చివరి నాటికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటు క్లాస్ టచ్ కూడా ఉండేలా కథను సిద్ధం చేయాలని బాలకృష్ణ దర్శకుడికి సూచించినట్లు సమాచారం.