ప్రకాశం: ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు అగ్నికి ఆహుతైంది. నడిరోడ్డుపై పూర్తిగా కాలిపోయింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై కే బిట్రగుంట దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి 27 మంది ప్రయాణికులతో పుదుచ్చేరికి బయలుదేరింది.
అర్ధరాత్రి దాటిన తర్వాత బస్సు ప్రకాశం జిల్లాలోని కే బిట్రగుంటకు చేరుకోగానే సాంకేతిక సమస్య తలెత్తి ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. అప్పటికి ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులందరినీ లేపాడు. హడావిడిగా అందరూ బస్సు దిగిపోగానే మంటలు మరింత తీవ్రమై బస్సు పూర్తిగా దగ్ధమైంది.
బస్సులో ఉన్న ప్రయాణికుల లగేజీ కూడా పూర్తిగా కాలిపోయింది. బాధితుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, బస్సు దగ్ధం కారణంగా రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
#WATCH | Andhra Pradesh: Fire broke out in a private bus due to a technical fault, in K Bitragunta village of Prakasam District, in the early morning hours. pic.twitter.com/N2vgUdFwv5
— ANI (@ANI) June 22, 2023