Crime news : భార్యాభర్తల గొడవ విషాదాంతమైంది. క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నలుగురిని తీవ్ర గాయాలపాలయ్యేలా చేసింది. ఛత్తీసగఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాయ్పూర్ జిల్లాలోని ఖామ్తారాయ్ పోలీస్టేషన్ పరిధిలోగల భాన్పురిలో అమ్రేశ్వర్రావు, సంధ్యారాణి అనే ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు.
శుక్రవారం రాత్రి ఓ చిన్న విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో గొడవ పెరిగి పెద్దదైంది. మాటామాటా పెరిగి పోట్లాటకు దారితీసింది. ఆగ్రహం పట్టలేకపోయిన అమ్రేశ్వర్ రావు ఇంట్లో కూరగాయలు కోసే కత్తితో భార్య సంధ్యారాణిపై దాడిచేశాడు. ఆమె తీవ్ర గాయాలతో బయటకు వచ్చి పడిపోయింది. ఆమెను వెంబడిస్తూ బయటకు వచ్చిన అమ్రేశ్వర్రావు ఇరగుపొరుగు పోగవడం చూసి మళ్లీ లోపలికి వెళ్లాడు.
ఓ క్యాన్లో పెట్రోల్ తీసుకొచ్చి ఇంట్లో చల్లాడు. ఆ తర్వాత అదే ఆవేశంలో నిప్పటించాడు. ఇంతలో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే అమ్రేశ్వర్రావు తగులబడుతున్న ఇంట్లోకి పరుగుతీశాడు. అతడు వెళ్లగానే ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో అమ్రేశ్వర్రావు అక్కడికక్కడే మరణించాడు.
అమ్రేశ్వర్రావును రక్షించేందుకు ప్రయత్నించి ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు, స్థానికులు ఇద్దరు గాయపడ్డారని రాయ్పూర్ అదనపు ఎస్పీ లఖన్ పటేల్ తెలిపారు. భర్త దాడిలో గాయపడిన సంధ్యారాణితోపాటు, సిలిండర్ పేలుడులో గాయపడ్డ నలుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. అమ్రేశ్వర్రావు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
#WATCH | Raipur, Chhattisgarh | A man died as he set the house on fire after a dispute with his wife. 4 including 2 constables and locals injured. pic.twitter.com/CcAgxNhkn0
— ANI (@ANI) December 14, 2024