Himanta Sarma | ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ముంబై ఉగ్రదాడి ఘటన ప్రస్తావనే వినిపిస్తోంది. అందుకు కారణం ముంబై 26/11 పేలుళ్ల కేసులో (Mumbai Terror Attacks) ప్రధాన నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణా (Tahawwur Rana)ను భారత్కు తీసుకురావడమే. ఆయన రాకతో నాటి భయానక పరిస్థితుల్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) సైతం ఆ మారణహోమాన్ని తలచుకున్నారు. ఆ దాడినుంచి తాను తృటిలో తప్పించుకున్నట్లు చెప్పారు.
‘ఉగ్రదాడులు జరిగిన రోజే నేను ముంబై తాజ్ హోటల్లో బస చేయాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో షెడ్యూల్ మారడంతో మరో హోటల్లో దిగాను. దీంతో ఆ దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డా. ఆ రోజు జరిగిన ఎన్ఎస్జీ ఆపరేషన్ ఇప్పటికీ నా కళ్ల ముందు మెదులుతోంది. కర్మ సిద్ధాంతం ప్రకారం దాడుల వెనక ఉన్న సూత్రధారులు ఏదో ఒకరోజు శిక్ష ఎదుర్కోక తప్పదని అప్పుడే భావించా. దాడి జరిగిన పదహారేళ్ల తర్వాత నిందితుడిని దేశంలో చూస్తుంటే న్యాయవ్యవస్థలపై మరింత విశ్వాసం పెరిగింది’ అని హిమంత వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
16 ఏళ్ల క్రితం అంటే 2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమానికి పాల్పడ్డారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా నగరంలో మారణహోమాన్ని సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబై చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో రాణా కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఇక దాడి జరిగిన ఏడాది తర్వాత అంటే 2009లో షికాగోలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన అమెరికా జైలులోనే శిక్ష అనుభవించారు.
Also Read..
“Tahawwur Rana | భారత్కు తహవ్వుర్ రాణా అప్పగింత తొలి ఫొటో విడుదల”
“Tahawwur Rana | ఎవరీ తహవూర్ రాణా..? ముంబై ఉగ్రదాడిలో అతడి పాత్రేంటి..?”