Tahawwur Rana | ముంబై ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకడైన తహవూర్ రాణా (Tahawwur Rana)ను అమెరికా ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఆయన్ని భారత్‌కు తరలిస్తున్నారు. రాణాతో వస్తున్న స్పెషల్ ఫ్లైట్ మరికాసేపట్లో ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇక రాణాను పాలెం ఎయిర్పోర్ట్ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రధాన కార్యాలయానికి తరలించేందుకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎయిర్పోర్ట్ వద్ద బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని అధికారులు సిద్ధంగా ఉంచినట్లు ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటికే స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ కమాండోలను (SWAT commandos) మోహరించారు. బుల్లెట్ ప్రూఫ్ కారు (Bulletproof vehicle)తో పాటు కాన్వాయ్‌లో సాయుధ వాహనాలు కూడా ఉంటాయని సదరు వర్గాలు తెలిపాయి. కాన్వాయ్‌లో ‘మార్క్స్‌మ్యాన్’ వాహనం కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ వాహనం ఏ రకమైన దాడినైనా తట్టుకోగల అత్యంత సురక్షితమైన సాయుధ కారు. ఈ వాహనాన్ని సాధారణంగా తీవ్రవాదులు, గ్యాంగ్స్టర్లు వంటి అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులను కోర్టులు, ఏజెన్సీ కార్యాలయాలకు తరలించేందుకు భద్రతా సంస్థలు ఉపయోగిస్తాయి.
16 ఏళ్ల క్రితం అంటే 2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమానికి పాల్పడ్డారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా నగరంలో మారణహోమాన్ని సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబై చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో రాణా కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి.
ఇక దాడి జరిగిన ఏడాది తర్వాత అంటే 2009లో షికాగోలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన అమెరికా లాస్ ఏంజెల్స్ జైల్లో ఇన్ని రోజులూ శిక్ష అనుభవించాడు. ఈ కేసులో తాజాగా అతడిని అమెరికా అధికారులు భారత్‌కు అప్పగించారు. నిఘా అధికారులు, దర్యాప్తు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తహవూర్ రాణాను తీసుకుని ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి బయల్దేరింది. బుధవారం ఉదయం 7.10 (భారతీయ కాలమానం) గంటలకు బయల్దేరిన విమానం గురువారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటుందని వారు చెప్పారు. రాణా ఢిల్లీలో దిగిన వెంటనే ఎన్ఐఏ అతడిని అధికారికంగా అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలిస్తుంది. రాణా తరలింపు దృష్ట్యా తీహార్ జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read..
Tahawwur Rana | ఎవరీ తహవూర్ రాణా..? ముంబై ఉగ్రదాడిలో అతడి పాత్రేంటి..?
Drinking Water | మంచినీళ్లు లేని ఊళ్లో తాను ఉండను.. భర్తను వదిలేసి వెళ్లిపోయిన భార్య