న్యూఢిల్లీ, జూలై 3: కేంద్రంలోని బీజేపీ సర్కారు, ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల మధ్య రాజకీయ వివాదానికి యూనివర్సిటీలు తాజా కేంద్ర బిందువుగా మారాయి. యూనివర్సిటీల వీసీల నియామకం విషయంలో కేంద్రం నియమించిన గవర్నర్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు రేగుతున్నాయి. గవర్నర్ల వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం తమపై పెత్తనం చెలాయించేందుకు యత్నిస్తున్నదని ఇప్పటికే విపక్ష పాలిత రాష్ర్టాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ర్టాల్లో రాజ్‌భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ నిర్ణయాలకు గవర్నర్లు మోకాలడ్డడం, పదేపదే అడ్డంకులు సృష్టిస్తుండటంతో గవర్నర్ల అధికారాలకు కత్తెర వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే యూనివర్సిటీల వీసీగా గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రిని నియమిస్తూ చట్టాలు చేస్తున్నాయి.
గవర్నర్ల ఏకపక్ష వైఖరి..
‘ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వాలు, గవర్నర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. నియామకాలకు ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం కానీ ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం కానీ జరుగట్లేదు. వీసీల నియామకాలు రాజకీయ నియామకాలుగా మారిపోయాయి. ఈ వివాదం ముదురుతున్నది. రాష్ర్టాల్లో ఉన్న గవర్నర్లు బీజేపీ వ్యక్తులే. వారు తమకు నచ్చిన వారిని వీసీగా నియమిస్తున్నారు’ అని మిరండా హౌస్ ప్రొఫెసర్, డీయూ అకడమిక్ కౌన్సిల్ మాజీ సభ్యులు అభాదేవ్ హబీబ్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇలానే రాష్ర్టాలను బలహీనపరిస్తే అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించారు.
వివిధ రాష్ర్టాల్లో వివాదాలు ఇలా..
పశ్చిమబెంగాల్..
బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వానికి, గవర్నర్ ధన్కర్కు మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గుమంటున్నది. తాజాగా రవీంద్రభారతి యూనివర్సిటీ కొత్త వీసీ నియామకం విషయంలో వివాదాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్రంలోని 31 వర్సిటీల చాన్స్‌లర్‌గా గవర్నర్ స్థానంలో సీఎంను నియమిస్తూ జూన్ 13న మమత ప్రభుత్వం ఓ బిల్లును తీసుకొచ్చింది. అసెంబ్లీలోనూ ఆమోదం పొందింది. అయితే ఈ బిల్లును గవర్నర్ ఆమోదించలేదు. బిల్లు తెచ్చిన కొద్ది రోజులకే రవీంద్ర భారతి వర్సిటీ వీసీని నియమించినట్టు గవర్నర్ ప్రకటించారు. దీంతో ప్రభుత్వం మండిపడింది. సీఎంను కూడా సంప్రదించకుండా నియమించడమేంటని నిలదీసింది.
తమిళనాడు
డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. నీట్, వీసీల నియామకం విషయంలో విభేదాలు తలెత్తాయి. గవర్నర్ ఇబ్బందులు పెడుతున్నారంటూ సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్నారు. దీంతో వీసీల నియామకంలో గవర్నర్ అధికారాలకు కత్తెర వేస్తూ, రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా బిల్లు తీసుకొచ్చింది.
రాజస్థాన్..
రాజస్థాన్‌లో వర్సిటీల పాలకవర్గ సమావేశాలను గవర్నర్ కల్రాజ్ మిశ్రా అడ్డుకోవడంపై రాజ్‌భవన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు భగ్గమన్నాయి. సమావేశాలను గవర్నర్ అడ్డుకోవడం నిరంకుశత్వానికి నిదర్శనమంటూ హరిదేవ్ జోషి వర్సిటీ వీసీ దుయ్యబట్టారు.
ఛత్తీస్‌గఢ్..
ఛత్తీస్‌గఢ్‌లోని ఇందిరాగాంధీ కృషి విశ్వ విద్యాలయ వీసీ నియామకంలో గవర్నర్ అనసూయ ఉయికే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలంటూ సీఎం భూపేశ్ బఘేల్ హితవు పలికారు. దీంతో రాజ్‌భవన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఒడిశా..
వీసీల నియామకంలో గవర్నర్ కొర్రీలు పెడుతున్నారంటూ ఒడిశా యూనివర్సిటీల సవరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ వివాదం హైకోర్టుకు చేరింది. చట్టాన్ని సమర్థిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే కొందరు ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో చట్టంపై 3 నెలలు స్టే విధించింది.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలోనూ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య మొన్నటి వరకు వివాదాలు చోటుచేసుకున్నాయి. పబ్లిక్ వర్సిటీల చట్టాన్ని అధ్యయనం చేసేందుకు ఉన్నత విద్యా శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వర్సిటీలకు ప్రో చాన్స్‌లర్ పోస్టు క్రియేట్ చేయాలని కమిటీ సిఫారసు చేసింది. దీంతో గవర్నర్ పెత్తనాన్ని కాస్త అయినా తగ్గించొచ్చని పేర్కొన్నది.