Ram Temple Opening Ceremony : అయోధ్యలో జనవరి 22న జరిగే నూతన రామాలయ ప్రారంభోత్సవ వేడుక బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల మంటలు రేపుతోంది. మందిర్ వేదికగా ఇరు పార్టీలు మాటల యుద్ధానికి సై అంటున్నాయి. ఇరు పార్టీల నేతలూ పరస్పర విమర్శలకు దిగుతూ డైలాగ్ వార్‌కు తెరలేపారు. కాంగ్రెస్ అగ్రనేతలు రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కాబోరని కాంగ్రెస్ స్పష్టం చేయడంతో ఆ పార్టీ లక్ష్యంగా కాషాయ నేతలు విమర్శలు గుప్పించారు. తమ పార్టీ నేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌధరి రామాలయ ప్రారంభోత్సవానికి అయోధ్యకు వెళ్లడం లేదని కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీజేపీ భగ్గుమంది.
అయోధ్యలో రామాలయ వేడుక బీజేపీ-ఆరెస్సెస్ వేడుకగా కాంగ్రెస్ పేర్కొనడంపై కాషాయ పార్టీ భగ్గుమంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ రాజకీయ ప్రాజెక్టుగా చేపడుతోందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ భాగస్వామ్య పార్టీలు హిందుత్వను, సనాతన ధర్మాన్ని నిత్యం అవమానిస్తాయని బీజేపీ ఆక్షేపించింది. రామజన్మభూమిని తొలినుంచీ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని బీజేపీ ఎంపీ హర్‌నాధ్ సింగ్ యాదవ్ ఆరోపించారు. రామాలయ నిర్మాణానికి అవరోధాలు సృష్టించేందుకు కాంగ్రెస్ అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నదని మండిపడ్డారు. హిందుత్వకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమేనని కర్నాటక బీజేపీ చీఫ్ సీటీ రవి అన్నారు.
గతంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్, బాబూ రాజేంద్ర ప్రసాద్ సోమనాధ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆలయాన్ని సందర్శించలేదని గుర్తుచేశారు. మరోవైపు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి హాజరు కారాదని కాంగ్రెస్ అగ్రనేతలు తీసుకున్న నిర్ణయాన్ని కర్నాటక సీఎం సిద్ధరామయ్య గురువారం సమర్ధించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయ కార్యక్రమంగా మార్చివేసిందని ఆరోపించారు. రామమందిరాన్ని రాజకీయాల్లోకి లాగడాన్ని నిరసిస్తూ నలుగురు శంకరాచార్యలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నారని అన్నారు.
డీకే శివకుమార్‌ను కట్టడి చేసేందుకు సిద్ధరామయ్య కొందరిని రెచ్చగొడుతున్నారని, ఇది ఆయన గేమ్ ప్లాన్ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. ఇక తొలుత అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తమకు ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ పేర్కొందని, ప్రస్తుతం వారికి ఆహ్వానం అందడంతో దాన్ని వారు అంగీకరించడం లేదని కాంగ్రెస్ తీరును బీజేపీ నేతలు ఆక్షేపించారు.
Read More :