Waqf Act | కోల్కతా : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం అమలుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టం అమలు చేయబడదు అని మమత తేల్చిచెప్పారు. కోల్కతాలో జైన్ కమ్యూనిటీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మమత పాల్గొని ప్రసంగించారు.
వక్ఫ్ సవరణ చట్టంతో మైనార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీఎం మమత పేర్కొన్నారు. మైనార్టీ ప్రజలు, వారి ఆస్తులను తాను పరిరక్షిస్తానని ఆమె స్పష్టం చేశారు. విభజించి పాలించాలనుకుంటే బెంగాల్లో కుదరదు. తనపై విశ్వాసం ఉంచండి. మీరంతా కలిసికట్టుగా ఉంటామని బలమైన సందేశం ఇవ్వండి. రాజకీయ ఉద్యమం ప్రారంభించాలంటూ రెచ్చగొట్టే వాళ్లను పట్టించుకోవద్దని మమతా బెనర్జీ సూచించారు.
వక్ఫ్ బిల్లుపై ముర్షీదాబాద్ జిల్లాలో హింస చెలరేగడాన్ని ప్రస్తావించిన మమతా బెనర్జీ.. బంగ్లాదేశ్లో పరిస్థితిని చూడండి. ఈ సమయంలో బిల్లు ఆమోదించి ఉండకూడదు. బెంగాల్లో 33 శాతం మైనారిటీలు ఉన్నారు. వారి విషయంలో నేను ఏం చేయాలి?” అని ప్రశ్నించారు. బెంగాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇండియా అన్నీ కలిసి ఉండేవని చరిత్ర చెబుతోందని, ఆ తర్వాత విభజన చోటుచేసుకుందని, ఇక్కడ నివసించాలని ఎవరైతే అనుకున్నారో వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ప్రజలంతా ఐక్యంగా, బలంగా నిలబడితే ఏదైనా సాధ్యమేనని మమత స్పష్టం చేశారు.