శ్రీనగర్: ఆర్మీ అధికారి చిత్రహింసల తర్వాత తాను ఉగ్రవాదిగా మారాలనుకున్నానని జమ్ముకశ్మీర్‌లో అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎమ్మెల్యే తెలిపారు. (Wanted To Be A Militan) అయితే ఒక సీనియర్ అధికారి చర్య వల్ల వ్యవస్థపై తనకు నమ్మకం కలిగిందని అన్నారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎన్సీ ఎమ్మెల్యే కైసర్ జంషైద్ లోన్ సభలో మాట్లాడారు. చిన్నప్పుడు తాను నివసించే ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి గురించి తనతో సహా 32 మంది యువకులను ఆర్మీ అధికారి ప్రశ్నించారని తెలిపారు. టెర్రరిస్ట్లో చేరిన యువకుడు తెలుసా? అని ఆ అధికారి తనను అడిగితే తెలుసని చెప్పానన్నారు. దీంతో ఆ మిలిటరీ అధికారి తనను కొట్టినట్లు చెప్పారు.
కాగా, ఉగ్రదాడిలో ఆ యువకుడు పాల్గొన్నాడా? అని ఆర్మీ అధికారి అడిగారని, లేదని చెప్పిన తనను మళ్లీ కొట్టాడని ఎన్సీ ఎమ్మెల్యే కైసర్ జంషైద్ లోన్ తెలిపారు. ఇంతలో ఒక సీరియర్ అధికారి అక్కడకు వచ్చి తనతో మాట్లాడారని అన్నారు. ‘నువ్వు జీవితంలో ఏమి కావాలనుకుంటున్నావు?’అని నన్ను అడిగారు. నేను మిలిటెంట్‌గా ఉండాలనుకుంటున్నానని చెప్పా. ఆయన నన్ను కారణం అడిగారు. ఆర్మీ అధికారి చేతిలో నేను అనుభవించిన చిత్రహింసల గురించి చెప్పా’ అని అన్నారు.
మరోవైపు జూనియర్ ఆర్మీ అధికారిని ఆ సీనియర్ అధికారి బహిరంగంగా మందలించారని ఎమ్మెల్యే కైసర్ జంషైద్ లోన్ తెలిపారు. ఆయన చర్య వల్ల వ్యవస్థపై తనకు నమ్మకం కుదిరిందని చెప్పారు. సమస్యలను చర్చల ద్వారా ఎలా పరిష్కరించవచ్చో ఈ సంఘటన నిరూపించిందని అన్నారు. అయితే ఆర్మీ వల్ల చిత్రహింసలకు గురైన 32 మంది యువకుల్లో 27 మంది ఆ తర్వాత మిలిటెన్సీలో చేరినట్లు తనకు తెలిసిందన్నారు.