Harsh Goenka | న్యూఢిల్లీ : మన దేశ స్టార్టప్ కంపెనీల పని సంస్కృతి, విలువల గురించి జరుగుతున్న చర్చలోకి ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా అడుగు పెట్టారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్, ‘ఇన్ఫోసిస్’ ఎన్ఆర్ నారాయణ మూర్తి అభిప్రాయాలతో ఏకీభవించారు. గోయెంకా శనివారం ఎక్స్‌లో స్పందిస్తూ.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, పీయూష్ గోయెల్ మాటలను యథాతథంగా అర్థం చేసుకోకూడదని చెప్పారు.
చైనా లేదా అమెరికాతో భారత దేశం పోటీపడాలనుకుంటే కేవలం సదుపాయం, సానుకూలత, బ్రాండ్స్ మీద మాత్రమే దృష్టి పెట్టడం సరిపోదని తెలిపారు. ఉన్నత స్థాయికి చేరుకోవాలనే బలమైన కోరికతో పని చేయాలన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), డీప్ టెక్, రోబోటిక్స్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాలు ప్రత్యేకతను, ప్రభావాన్ని చూపుతాయని వివరించారు. ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం వారానికి 90 గంటలు పని చేయాలని చెప్పినపుడు గోయెంకా అందుకు విరుద్ధంగా స్పందించారు.