Fast Walking | న్యూఢిల్లీ: నడకలో వేగం ఉంటే డయాబెటిస్ లేదా గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్థూలకాయం లేదా నడుము చుట్టు కొలత అధికంగా ఉన్న దాదాపు 25,000 మందిని జపాన్లోని దోషిషా యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. మీ వయసు, జెండర్ కన్నా మీ నడక వేగంగా ఉందా అన్న ఒకే ఒక ప్రశ్నను వారికి సంధించి వారి నుంచి సమాధానాన్ని రాబట్టారు. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్లో ప్రచురించిన ఈ సర్వే నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వేగంగా నడిచే వారిలో డయాబెటిస్ ముప్పు దాదాపు 30 శాతం తక్కువని వెల్లడైంది.
హైపర్టెన్షన్, డిస్లీపిడీమియా (రక్తంలో అసాధారణ లిపోప్రొటీన్ లెవల్స్) ముప్పు కూడా చాలా తక్కువని తేలింది. నడక వేగానికి, సమగ్ర ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు. వేగంగా నడిచే వాకర్లలో గుండె, ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. ఈ వ్యవస్థ పనితీరు సరిగ్గా లేనట్టయితే జీవక్రియకు సంబంధించిన వ్యాధులు వచ్చే ముప్పు అధికంగా ఉంటుంది.