తిరువనంతపురం: కేరళ మాజీ సీఎం, సీపీఎం సీనియర్ నేత వీఎస్ అచ్యుతానందన్(101) సోమవారం కన్నుమూశారు. పేదల పక్షపాతిగా, భారత్‌లో వామపక్ష ఉద్యమంలో చివరి సీనియర్ నాయకుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఎనిమిది దశాబ్దాల తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ప్రగతికి విశేష కృషి చేశారు. సీపీఐ నుంచి విడిపోయిన మరొక పార్టీగా సీపీఎం ఏర్పడినప్పుడు ఆ పార్టీలో ఉన్న 32 మంది వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. 1965 నుంచి 2016 మధ్య కాలంలో ఆయన పది సార్లు కేరళ శాసనసభకు పోటీ చేసి ఏడుసార్లు గెలుపొందారు. ఆయన ఆలోచింపచేసే ప్రసంగాలు, ఆదర్శాల పట్ల అంకిత భావం రాజకీయ ప్రత్యర్థుల నుంచి కూడా మన్ననలు పొందాయి.
ఆయన ఇటీవల కాలంలో అనారోగ్యం కారణంగా బయటి ప్రపంచానికి కనిపించలేదు. 2006లో 82 ఏండ్ల వయసులో ఆయన సీపీఎంను తిరిగి అధికారంలోకి తీసుకు రాగలిగారు. 1923లో అలప్పుజలోని ఒక పేద కుటుంబంలో పుట్టిన ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. యువకుడిగా ఉన్నప్పుడు ఓ టైలరింగ్ షాపులో పని చేశారు. ఆ తర్వాత ఒక కొబ్బరి పరిశ్రమలో పనిచేస్తూ కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరారు. సీపీఎం పార్టీ తన ఎక్స్ ఖాతాలో అచ్యుతానందన్ మృతికి రెడ్ సెల్యూట్ ప్రకటించింది.
హైదరాబాద్, జూలై 21 (నమస్తేతెలంగాణ): దేశ రాజకీయాల్లో మచ్చలేని మహానేత వీఎస్ అచ్యుతానందన్ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన ఆదర్శాలను పాటిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో అచ్యుతానందన్ చిత్రపటానికి బీవీ రాఘవులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఎం ఏర్పాటుకు కీలకపాత్ర పోషించిన వారిలో అచ్యుతానందన్ ఒకరన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా సైద్ధాంతిక, ప్రజా పోరాటాల్లో రాజీపడని వ్యక్తి వీఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.సాగర్, పి.ప్రభాకర్, బండారు రవికుమార్, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, స్కైలాబ్‌బాబు, ఆరిబండి ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, జూలై 21(నమస్తేతెలంగాణ): కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజాయితీగా, ప్రజాహితం కోసం పనిచేసిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సోమవారం ఎక్స్ వేదికగా కొనియాడారు. సీపీఎం వ్యవస్థాపక సభ్యుడిగా ఆయన అనేక తరాలకు ప్రేరణగా నిలిచారని ప్రశంసించారు. అచ్యుతానందన్ కుటుంబసభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అచ్యుతానందన్ ప్రజాహితానికి పాటుపడిన గొప్ప నాయకుడని మాజీ మంత్రి హరీశ్‌రావు కీర్తించారు. ఆయన మరణం బాధాకరమన్నారు. కుటుంబసభ్యులు, అభిమానులకు సానుభూతి తెలిపారు.