శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో (J&K Assembly polls) బుధవారం జరిగిన తొలి విడత పోలింగ్‌లో 58.85 శాతం ఓటింగ్ నమోదైంది. కిష్త్వార్‌లో అత్యధికం, పుల్వామాలో అత్యల్పంగా పోలింగ్ జరిగింది. కశ్మీర్‌లోని నాలుగు జిల్లాలైన అనంత్‌నాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గామ్‌లోని 16 స్థానాలు, జమ్ములోని మూడు జిల్లాలైన దోడా, రాంబన్, కిష్త్వార్లోని 8 స్థానాల్లో బుధవారం తొలి దశ కింద పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. తొలి దశలో 58.85 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. కిష్త్వార్ జిల్లాలో అత్యధికం, పుల్వామాలో అత్యల్పంగా ఓటింగ్ నమోదైనట్లు తెలిపింది. సాయంత్రం 5 గంటల వరకు జిల్లాల వారీగా ఓటింగ్ శాతాన్ని ఈసీ పేర్కొంది. కిష్త్వార్‌లో 77.23 శాతం, దోడాలో 69.33 శాతం, రాంబన్‌లో 67.71 శాతం, కుల్గామ్‌లో 59.62 శాతం, అనంతనాగ్‌లో 54.17శాతం, షోపియాన్‌లో 53.64 శాతం, పుల్వామాలో 43.87 శాతం ఓటింగ్ నమోదైనట్లు వివరించింది.
కాగా, జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ను 2019 ఆగస్ట్‌లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లఢక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. డీలిమిటేషన్ కసరత్తు తర్వాత కశ్మీర్‌కు 47, జమ్ముకు 43 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. పదేళ్ల తర్వాత మొత్తం 90 అసెంబ్లీ నియోజక వర్గాలకుగాను తొలి దశలో 24 నియోజక వర్గాల్లో బుధవారం పోలింగ్ నిర్వహించారు.