(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): బీహార్‌లో ఓట్ల సవరణ వివాదం, ఈవీఎంల విశ్వసనీయతపై దేశవ్యాప్తం గా పెద్దయెత్తున చర్చ జరుగుతున్న సమ యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బడా గోల్మాల్ ఒకటి తాజాగా వెలుగు చూసింది. గుజరాత్‌కు చెందిన 10 రాజకీయ పార్టీలకు ఐదేండ్ల వ్యవధిలో ఏకంగా రూ.4,300 కోట్ల విరాళాలు వచ్చా యి.
ఇంతపెద్దయెత్తున విరాళాలు అందు కొన్న ఆ పార్టీలకు ప్రజాక్షేత్రంలో గుర్తింపు ఉందా? అంటే అదీ లేదు. పోనీ ఆయా పార్టీల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు ప్రముఖులా? అంటే సమాధానం ఉండదు. పోనీ ఆయా అభ్యర్థులకు ఓైట్లెనా భారీగా వచ్చాయా? అంటే .. అదీ లేదు. మొత్తం 10 పార్టీల నుంచి పోటీలో నిలిచిన 43 మంది అభ్యర్థులకు తిప్పి కొడితే 55 వేల ఓట్లు కూడా రాలేదు. ఈ మేరకు జాతీయ న్యూస్ వెబ్సైట్ ‘ధైనిక్ భాస్కర్’ ప్రచురించిన ఓ పరిశోధన కథనం ద్వారా బయటపడింది.
‘ధైనిక్ భాస్కర్’ కథనం ప్రకారం.. 2019-20 నుంచి 2023-24 మధ్య గుజరాత్‌కు చెందిన 10 అనామక పార్టీలకు రూ.4,300 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. ఎన్నికల ప్రచారం కోసం రూ.39.02 లక్షలను ఖర్చు చేసినట్టు ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నాయి. కానీ, ఆడిట్ రిపోర్ట్‌లో మాత్రం ఈ లెక్కలను రూ. 3,500 కోట్లుగా చూపించాయి. దీంతో ఈ పార్టీలకు అందిన విరాళాల్లో ఏదో గూడుపుఠాణీ దాగి ఉన్నదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల సంఘానికి ఆయా అనామక పార్టీలు ఇచ్చిన అఫిడవిట్‌లోని ప్రచార ఖర్చులకు, ఆడిట్ రిపోర్ట్ లెక్కలకు మధ్య భారీగా తేడా ఉండటంతో ఇదే విషయమై ఆయా పార్టీల అధినేతలను ‘దైనిక్ భాస్కర్’ ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి వాళ్లు సమాధానమిస్తూ.. ఆ విషయాలు తమకు తెలియదని, సీఏను అడిగి చెప్తామని దాటవేత ధోరణిని ప్రదర్శించారు. ఇదంతా విశ్లేషిస్తే, అనామక పార్టీల పేరిట ఏదో ఓ ప్రధాన పార్టీ ఈ విరాళాలను సేకరించిందా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఆ పార్టీలకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా వచ్చింది? ఆ తర్వాత ఆ డబ్బు ఎటు పోయిందన్న విషయంపై ఈసీ దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు.
ఊరు-పేరూ లేని పది పార్టీలకు రూ.4,300 కోట్ల విరాళాలు వచ్చాయి. ఆయా పార్టీల టికెట్లతో బరిలోకి దిగిన 43 మందికి కేవలం 54 వేల ఓట్లే వచ్చాయి. ఇదంతా అనుమానంగా ఉంది. దీనికి ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి.
-డాక్టర్ సుమంత్ రామన్, రాజకీయ విశ్లేషకులు