Manipur | ఇంఫాల్: జాతుల వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొని రాష్ట్రం యథాతథ స్థితికి రావాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను తెలుసుకోవడానికి ఇండియా కూటమికి చెందిన 21 మంది ఎంపీలు ఇంఫాల్‌కు చేరుకుని బాధితులతో మాట్లాడారు. బాధితుల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికే మణిపూర్ వచ్చాం తప్ప రాజకీయాలు చేయడానికి కాదని వారు స్పష్టం చేశారు.
దుండగుల దాడిలో హతమైన తన భర్త, కుమారుడి మృతదేహాలైనా చూడటానికి తనకు సహాయం చేయాలని మణిపూర్ ‘నగ్న’ బాధితుల్లోని ఒక మహిళ తల్లి వారిని కోరింది. మణిపూర్ హింసాకాండలో కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న ఆమె గోడు చూపరులను చలింపచేసింది. కాగా, ఎంపీల బృందం చురాచాంద్‌పూర్‌లోని శిబిరంలో ఉన్న బాధితులతో మాట్లాడింది. ఇలా ఉండగా, మణిపూర్‌లో కుకీలు నివసించే ప్రాంతాలలో ప్రత్యేక పరిపాలన తేవాలని తాము చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని ద ఇండీజీనియస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం (ఐటీఎల్ఎఫ్) విపక్షాల కూటమికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది. కాగా, మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి చేసి నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తు బాధ్యతను శనివారం సీబీఐ తీసుకుంది.