న్యూఢిల్లీ: అమెరికా చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించేవారి వీసా రద్దు కావడంతోపాటు బహిష్కరణ తప్పదని భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం హెచ్చరించింది. వీసా జారీ చేసినంత మాత్రాన స్క్రీనింగ్ ఆగదని, వీసా హోల్డర్లు యూఎస్ చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనలు పాటిస్తున్నారో, లేదో నిర్ధారించుకోవడానికి నిరంతరం తనిఖీలు చేస్తూనే ఉంటామని పేర్కొంది. నిబంధనలకు కట్టుబడని వారి వీసా రద్దు కావడంతోపాటు బహిష్కరణను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంటూ శనివారం ఎక్స్‌లో జారీ చేసిన ప్రజా హిత సూచనలో హెచ్చరించింది. విద్యార్థులు, ఎక్స్చేంజ్ సందర్శకులకు జారీచేసే ఎఫ్, ఎం, జే క్యాటగిరీ వీసాల కోసం తమ సోషల్ మీడియా ఖాతాలను బహిరంగ పరచాలని అమెరికా ఇటీవలే కోరింది. అంతలోనే ఇప్పుడు ఈ హెచ్చరిక జారీచేయడం గమనార్హం. ఈ నెల 4న అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’ బిల్లు ద్వారా కొత్త వీసా ఫీజు విధానం అమల్లోకి వచ్చింది. ఇందులో ‘ఇంటిగ్రిటీ ఫీజు’గా నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు 250 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. 2026 ఆర్థిక సంవత్సరం నుంచి రానున్నది.