మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు బాస్ ఫోన్ చేసి ‘ఫలానా పని అర్జెంట్‌గా పూర్తి చెయ్’ అంటే ఏం చేస్తాం? మన పని మధ్యలో ఆపేసి బాస్ చెప్పిన పని పూర్తి చేస్తాం. అదే డ్రైవింగ్‌లో ఉంటే? గమ్యానికి చేరుకోగానే బాస్ చెప్పిన పని చేస్తాం. కానీ ఒక వ్యక్తి మాత్రం తన ప్రయాణంలోనే బాస్ చెప్పిన పని పూర్తి చేసేయాలని నిర్ణయించుకున్నాడు.
బైక్‌పై వెళ్తూ ల్యాప్ టాప్ తీసి పని చేయడం మొదలు పెట్టాడు. అతన్ని ఎక్కించుకొని వెళ్తున్న డ్రైవర్ కూడా దాని గురించి ఏమీ మాట్లాడనట్లుంది. అలాగే వర్క్ చేసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను హర్ష్మీత్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘‘బెంగళూరులో రాత్రి 11 గంటల సమయంలో. సిటీలోనే బిజీగా ఉండే ఒక ఫ్లైఓవర్‌పై పిలియన్ రైడర్ తన ల్యాప్ టాప్ తీసి ఇలా వర్క్ చేస్తున్నాడు.
కొలీగ్స్ వాళ్ల భద్రతను కూడా మర్చిపోయి ఇలా పనిచేసేలా చేసే భయంకరమైన బాస్‌లు ఇప్పటికైనా మారాలి. ‘ఇది చాలా అర్జెంట్’, ‘ఇది వెంటనే చెయ్యి’ వంటి వాక్యాలను ఇప్పటికైనా జాగ్రత్తగా వాడదాం. ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్లు వీటిని చాలా పొదుపుగా వాడాలి. ఆ మాటలు మీ సహోద్యోగుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మీకు తెలీదు’’ అని హర్ష్ పోస్టు చేశాడు.
అయితే ఇది కేవలం సదర వ్యక్తి తప్పేనని.. అతను కావాలంటే బండి రోడ్డు పక్కనే ఆపేసి కూడా పని చేసుకోవచ్చని కొందరు నెటిజన్లు చెప్తున్నారు. ఇంత ప్రమాదకరంగా పని చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ఉద్యోగులపై ప్రెజర్ అలాగే ఉంటుందని చెప్తున్నారు. ఏదేమైనా ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.