Viral News | అప్పుడే చీకటి పడుతున్నది. ముఖ్యమంత్రి ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఓ రహదారిపై లారీ ఆగింది. పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడారు. అక్కడ ఎవరు చూసినా ఫొటోలు తీస్తున్నారు. మరికొందరేమో వీడియోలు తీసుకుంటున్నారు. ఆ మార్గంలో వస్తున్న వారంతా అక్కడ ఏం జరిగింది ? అసలు ట్రక్కులో ఏముంది ? అంటూ ఆరా తీస్తున్నారు. అధ్యయనం చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి జనం వస్తున్నారంటూ పలువురు సైటర్లు వేయడం కనిపించింది. ఇంతకీ ఆ ట్రక్కులో ఏం ముందంటే.. ఆవాల నూనె ముసుగులో మద్యం అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఈ ఘటన బిహార్ ముఖ్యమంత్రి నివాసానికి రెండు కిలోమీటర్ల దూరం, అసెంబ్లీకి 300 మీటర్ల దూరంలో గార్డినీబాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం ఘటన చోటు జరిగింది. హర్యానాకు చెందిన కంటైనర్‌లో పాట్నా మీదుగా ముజఫర్‌పూర్‌కు మద్యం అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు గార్డినీబాగ్ పోలీసులతో పాటు ఎక్సైజ్ సిబ్బంది నిఘా వేసి ఉంచారు. సదరు కంటైనర్ అనిసాబాద్ గోలంబర్కు చేరుకోగా.. పోలీసులు కంటైనర్‌ను చుట్టుముట్టారు.
పోలీసులను చూసి కంటైనర్ డ్రైవర్.. అతని సహాయకుడు పారిపోయేందుకు ప్రయత్నించగా.. వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన డ్రైవర్ గుజరాత్‌కు చెందిన వ్యక్తి కాగా.. అతని సహాయకుడు పాట్నా వాసి. ఆవనూనె ప్యాకెట్ల పేరుతో మద్యం వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. ఓ కంపెనీకి చెందిన పేరుతో ముద్రించిన లేబుల్స్ ఉన్న కార్డన్లలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బిహార్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నది. ఈ క్రమంలో పలువురు వ్యాపారులు అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తుండగా.. కంటైనర్‌లో పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలిపాయి.