Viral news : ఓ దొంగ ఫూటుగా మద్యం సేవించి దొంగతనానికి వెళ్లాడు. పని పూర్తయిన తర్వాత వెంట తీసుకెళ్లిన మద్యం సేవించి మత్తులో అక్కడే నిద్రపోయాడు. మరుసటి తెల్లగా తెల్లవారినా అతడు నిద్రలేవలేదు. ఉదయం గ్రామస్తులు దొంగను పట్టుకుని చితకబాదారు. ఊర్లోని ఓ చెట్టుకు తలకిందులుగా వేలాడదీశారు. రాజస్థాన్లోని బుండి గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. బుండి గ్రామానికి చెందని హన్సరాజ్ అనే వ్యక్తి ఊరు శివార్లలోని పొల్లాల్లోకి వెళ్లి కరెంటు వైర్లు దొంగిలించాడు. దొంగిలించిన వైర్లు అన్నింటిని బ్యాగులో సర్దుకున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న దొంగ ఆ తర్వాత కూడా తన వెంట తెచ్చుకున్న మద్యాన్ని సేవించాడు. ఆ తర్వాత మద్యం మత్తులో ఓ పొలం గట్టున ఉన్న పాకలో పడుకున్నాడు.
మద్యం మత్తులో జోగుతున్న అతడిని తెల్లవారినా మెళుకువ రాలేదు. ఇంతలో పొలాలకు వచ్చిన గ్రామస్తులు ఆ దొంగను గమనించి పట్టుకున్నారు. పొలాల దగ్గరే అతడిని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత ఊర్లోకి తీసుకొచ్చి, ఊరి నడుమ ఉన్న పెద్ద చెట్టుకు వేలాడ దీశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దొంగను స్టేషన్కు తీసుకెళ్లారు. కాగా, ఈ దొంగ చేసిన పనికి గ్రామస్తులంతా నవ్వుకుంటున్నారు.