హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు వేస్తూ గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ మోసపు రంగు.. తాజా పోలీస్ నోటిఫికేషన్‌తో బయటపడింది. 7,437 పోలీసు కొలువుల్లో 4 జిల్లాల్లోని సివిల్, ఏఆర్ విభాగాల్లో పోటీపడే అభ్యర్థులకు రిక్తహస్తం చూపించింది. ఇందులో తెలంగాణ పోలీసుశాఖకు అత్యంత కీలకమైన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్లకు ఒక్కటంటే ఒక్క సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు మంజూరు చేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్లో మొత్తం 3,697 సివిల్ కానిస్టేబుల్, 1,052 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల్లో యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేసింది.
ఎన్నో ఏండ్లుగా కష్టపడి నోటిఫికేషన్ల కోసం చదువుకుంటున్న తమను కాంగ్రెస్ సర్కార్ దగా చేసిందని నిరుద్యోగ అభ్యర్థులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (సీయూఆర్ఈ)’ జిల్లాల్లో ఒక్క సంగారెడ్డి మినహా.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఒక్క పోస్టూ మంజూరు చేయలేదు. శాంతి భద్రతల్లో అత్యంత కీలకమైన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లకు సైతం సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లను కేటాయించకపోవడం ప్రభుత్వం, ముఖ్యమంత్రి అసమర్థతగా నిరుద్యోగులు భావిస్తున్నారు. తెలంగాణ పోలీసు శాఖలో దాదాపు 19వేల వరకు ఖాళీలు ఉన్నట్టు సాక్షాత్తు ఉన్నతాధికారులే చెప్తున్నా.. అన్ని జిల్లాలకు పోస్టులు మంజూరు చేయడంలో కాంగ్రెస్ విఫలమైనదని అంటున్నారు. క్యూర్ పరిధిలోని ఒక్క సంగారెడ్డి జిల్లాకు మాత్రమే 248 సివిల్, 73 ఏఆర్ పోస్టులు మంజూరు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిల్లో 8 గత నోటిఫికేషన్లో మిగిలిన పోస్టులేనని చెప్తున్నారు.
‘క్యూర్’ పరిధిలోనే లక్షలాది మంది నిరుద్యోగులు పోలీసు కొలువుల కోసం సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రులు పంపే డబ్బులతో దిల్సుఖ్నగర్, అశోక్‌నగర్, అమీర్‌పేట్‌లో కోచింగ్ తీసుకుంటున్నారు. 2022 ఏప్రిల్ తర్వాత మళ్లీ ఇప్పుడే 2026 జూలైలో నోటిఫికేషన్ ఇచ్చారు. దాదాపు నాలుగేండ్లుగా నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్లలో ఒక్కటంటే ఒక్క కానిస్టేబుల్ పోస్టు ఇవ్వకపోవడం నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయమని అంటున్నారు. ఇందులో కాంగ్రెస్ నేతల రాజకీయ కుట్ర కోణం దాగి ఉన్నదని నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓఆర్ఆర్, ప్రస్తుతం కాంగ్రెస్ చెప్పుకొంటున్న క్యూర్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఒక్కరు కూడా గెలువలేదు. దీంతో నిరుద్యోగులపై కక్ష పెంచుకున్న రేవంత్‌రెడ్డి తాజా నోటిఫికేషన్లో ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా ఇవ్వకుండా ఆ పగ తీర్చుకున్నారని వాపోతున్నారు. క్యూర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఒక్క కానిస్టేబుల్ పోస్టురాని మిగతా జిల్లాల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో మాట్లాడి, ప్రభుత్వాన్ని ఒప్పించి.. అన్ని జిల్లాలకు పోస్టులు మంజూరయ్యేలా, 20 వేల కొలువులతో నోటిఫికేషన్ సవరించేలా ఒత్తిడి తేవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా నోటిఫికేషన్లో ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా దక్కని యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం విషమ పరీక్ష పెట్టింది. ఎందుకంటే వీరు తెలంగాణ బిడ్డలే అయినా.. ఈ నోటిఫికేషన్లో ‘నాన్ లోకల్’ పరిధిలోకి వస్తారు. ఆయా జిల్లాల స్థానిక అభ్యర్థులకు 95 శాతం లోకల్ రిజర్వేషన్ పోగా మిగిలిన 5 శాతం సీట్ల కోసం ఈ 8 జిల్లాల అభ్యర్థులు పోరాడాల్సి ఉంటుంది. దీంతో ఆయా జిల్లాల నిరుద్యోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమపై ఇంతటి కక్షసాధింపు ధోరణి ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తమ తల్లిదండ్రుల చెమట కష్టాన్ని చూసైనా పోస్టులు పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌కే దక్కుతుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో 18 వేల ఖాళీలు, 2018లో 18,428 ఖాళీలు, 2022లో 15,644 ఖాళీలను భర్తీ చేసింది. బీఆర్ఎస్ తన 9 ఏండ్ల పాలనలో మొత్తం 52,072 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసింది. 2022 నోటిఫికేషన్లో పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్స్, మెడికల్ పరీక్షలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఎస్బీ విచారణ, తుది పరీక్షలు వంటివన్నీ పూర్తయ్యాయి. ఫలితాలు విడుదల చేసే సమయంలో కోర్టు కేసులతో పెండింగ్ పడింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు వివాదాలు పరిష్కారమైన తర్వాత 15,644 కొలువులను భర్తీ చేసి, తాము ఇవ్వాల్సిన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాతాలో వేసుకున్నది. అయినా, పరేడ్ గ్రౌండ్ సాక్షిగా అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న నిరుద్యోగులంతా 15,644 కొలువుల ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌దేనని చెప్పారు.