Ayodhya Ram Mandir | అయోధ్య బాల రాముడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాలో పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు.. రామనగరికి చేరుకుంటున్నారు. గత 20 రోజుల్లో దాదాపు 50లక్షలకుపైగా భక్తులు రాంలాలా ఆస్థానికి వచ్చారు. ప్రతిరోజూ మూడులక్షలకుపైగా భక్తులు ఆస్థానానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో చాలామంది వీఐపీ దర్శనం కోసం పోటీపడుతున్నారు. ఫిబ్రవరి 11 వరకు రామమందిరం వీఐపీ పాస్‌లు ఫుల్ అయ్యాయి. గతంలో భక్తులు అధికంగా వచ్చే రోజుల్లో వీఐపీ పాస్‌ల జారీపై నిషేధం విధించారు. ప్రస్తుతం మళ్లీ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా.. దర్శన సమయాలను పొడిగించారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12గంటల వరకు దర్శనాలు కొనసాగాయి.
సోమవారం ఉదయం 5 గంటలకే ఆలయాన్ని తెరిచారు. రామ్‌లాలా మంగళ హారతి ఉదయం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగించనున్నారు. మరో వైపు దాదాపు నాలుగువేల మంది రామమందిరంలో వీఐపీ దర్శనం చేసుకుంటున్నారు. సాధారణ రోజుల్లో ఈ సంఖ్య రెండువేలుగా ఉండేది. వీఐపీ దర్శనం కోసం రామమందిర ట్రస్ట్ ఏడు స్లాట్లను నిర్ణయించింది. ప్రతి స్లాట్‌లో పరిమిత సంఖ్యలో పాస్‌లు జారీ చేయనున్నది. వీఐపీ దర్శనం కోసం అన్ని స్లాట్లను రెండు నుంచి మూడు రోజుల ముందుగానే బుక్ చేసుకుంటున్నట్లు రామమందిర ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. భక్తుల సౌలభ్యం కోసం ముందస్తు బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
మరో వైపు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అంబేద్కర్ నగర్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మూడు ప్రధాన సరిహద్దులోని ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను మళ్లిస్తున్నారు. ఎస్పీ కేశవ్ కుమార్ ట్రాఫిక్ మళ్లింపును పర్యవేక్షించారు. అంబేద్కర్ నగర్-అయోధ్య సరిహద్దులోని యాదవ్‌నగర్, ఇబ్రహీంపూర్‌లోని సేవాగంజ్, అహిరౌలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని భితిలోని చానాహా కూడలి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడం ద్వారా వాహనాలను మళ్లించారు. బస్తీ, అజమ్ఘర్కు వెళ్లే వాహనాలను సేవాగంజ్ ద్వారా సాన్వారియా ద్వారా, యాదవ్‌నగర్ నుంచి వాహనాలను అక్బర్పూర్ వైపు.. చానాహా కూడలి నుంచి వాహనాలను అహిరౌలి వైపు మళ్లిస్తున్నారు.