బెంగళూరు : ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన మూడు హత్యలు కలకలం రేపాయి. మొదటి ఘటన మహాలక్ష్మి లే అవుట్లో జరిగింది. పెండ్లి విషయమై జరిగిన వాగ్వాదంలో అంజలి(23) అనే యువతిని ఆమె ప్రియుడు రాజీవ్ కత్తితో పొడిచి చంపాడు. అతడికి నేర చరిత్ర ఉండటంతో పెండ్లికి అంజలి కుటుంబం నిరాకరించింది. హత్య జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండో ఘటనలో కృష్ణ బర్మన్(40) అనే మహిళ మునియప్ప లేఅవుట్లోని తన అద్దె ఇంట్లో చనిపోయి కనిపించింది.
తెలిసినవారే ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడో ఘటన జేపీ నగర్ రోడ్లో ఐజీ సర్కిల్ దగ్గర ప్రజలందరూ చూస్తుండగా జరిగింది. నేర చరిత్ర కలిగిన రాజా అలియాస్ హల్ముక్ రాజాను కొందరు దుండగులు వెంబడించి కత్తులు, కొడవళ్లతో దాడి చేసి పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీ పుటేజీలో కనిపించాయి. బాధితుడు దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మూడు కేసులు దర్యాప్తులో ఉన్నాయి.