లక్నో: మసీదు సర్వేను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులతో ఘర్షణ సందర్భంగా రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ హింసలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పోలీసులతో సహా 30 మందికిపైగా గాయపడ్డారు. (Violence Over Mosque Survey) ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మొఘల్ కాలం నాటి జామా మసీదుపై ఒక వ్యక్తి స్థానిక కోర్టును ఆశ్రయించాడు. హిందూ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించినట్లు ఆరోపించాడు. దీంతో సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది. మంగళవారం తొలిసారి సర్వే జరుపడడంతో ఉద్రికత్తలకు దారితీసింది.
కాగా, ఆదివారం ఉదయం 7 గంటలకు అడ్వకేట్ కమిషనర్ నేతృత్వంలోని సర్వే బృందం ఆ మసీదు వద్దకు చేరుకున్నది. పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే సుమారు వెయ్యి మందికిపైగా స్థానికులు సర్వే బృందాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణ జరిగింది. స్థానికులు రాళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలను తగులబెట్టారు.
మరోవైపు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడంతోపాటు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ హింసలో నయీమ్, బిలాల్, నౌమాన్ అనే ముగ్గురు వ్యక్తులు మరణించారు. సుమారు 20 మందికిపైగా పోలీసులతో సహా 30 మందికిపైగా గాయపడ్డారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించారు.