న్యూఢిల్లీ : మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే అక్కడ మళ్లీ హింస చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం టాంగ్ఖుల్ నాగా, కుకీ వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. సాయుధులైన దుండగులు లిటాన్ గ్రామంలో 20కిపైగా ఇండ్లకు నిప్పు పెట్టారని అధికారులు తెలిపారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు భద్రతా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపినట్టు పేర్కొన్నారు.
లిటాన్, టాంగ్ఖుల్ గ్రామానికి చెందిన ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇండ్లను వదిలి, పక్క జిల్లా కాంగ్పోక్పీకి పారిపోయారని తెలిసింది. లిటాన్ గ్రామంలో శనివారం రాత్రి నాగా వర్గానికి చెందిన ఓ వ్యక్తిపై సామూహిక దాడి ఘటన.. తాజా హింసకు దారితీసిందని అధికారులు చెబుతున్నారు.