Stampede | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని కరూర్ జిల్లా (Karur district)లో టీవీకే ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede) అంశం రాజకీయపరంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉందని, అంతేకాదు కొద్దిసేపు కరెంటు కూడా పోయిందని (power cut) ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై తమిళనాడు విద్యుత్ బోర్డు (Tamil Nadu Electricity Board) స్పందించింది. పవర్ కట్ వార్తలను ఖండించింది.
విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్ నిలిపివేయాలని టీవీకే పార్టీ నుంచి తమకు లేఖ అందిందని తమిళనాడు విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజలక్ష్మి తెలిపారు. సెప్టెంబర్ 27, 2025 ఈరోడ్ రోడ్డులోని వేలుచామిపురం వద్ద భారీ జనసమూహం ఉంటుందని పేర్కొంటూ టీవీకే నుంచి లేఖ అందినట్లు చెప్పారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని విజయ్ ప్రసంగిస్తున్నప్పుడు కొంతసేపు విద్యుత్‌ను నిలిపివేయాలని అందులో కోరినట్లు పేర్కొన్నారు. ఆ అభ్యర్థనను తాము తిరస్కరించినట్లు రాజలక్ష్మి వెల్లడించారు. అయితే, విద్యుత్ కోత కుట్రలో భాగమంటూ టీవీకే వర్గాలు ఆరోపించిన విషయం తెలిసిందే. కొందరు ప్రత్యక్ష సాక్షులు మాత్రం రాత్రి 7 నుంచి 7:30 మధ్య పవర్ కట్ అయినట్లు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని టీవీకే (TVK).. మద్రాస్ హైకోర్టు (Madras High Court) ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
కరూర్‌లో శనివారం రాత్రి నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల కటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున, తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున, కేంద్రం రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
Also Read..
Actor Vijay | కరూర్ తొక్కిసలాట.. టీవీకే చీఫ్ విజయ్‌కి బాంబు బెదిరింపులు
తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు చేయాలి
Shashi Tharoor | మన వ్యవస్థలో ఏదో లోపముంది.. తొక్కిసలాట ఘటనపై శశిథరూర్