చెన్నై: ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఆదివారం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కరూర్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో తొక్కిసలాట దుర్ఘటనపై దర్యాప్తు చేయాలని సీబీఐ లేదా సిట్‌ను ఆదేశించాలని కోరింది. జస్టిస్ దండపాణి సమక్షంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ దుర్ఘటనలో 40 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. సోమవారం తమ పిటిషన్‌పై విచారణ జరుగుతుందని టీవీకే నేతలు చెప్పారు.
తొక్కిసలాటలో మరణించినవారి కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున, గాయపడినవారికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు విజయ్ ఆదివారం ప్రకటించారు. “మీరు అనుభవిస్తున్న నష్టానికి ఇది పెద్ద మొత్తం కాదు. మీకు జరిగిన నష్టాన్ని మరొకదానితో పూడ్చలేమని నాకు తెలుసు. ఈ సమయంలో మీ పక్కన ఉంటూ, మీ విచారాన్ని పంచుకోవడం నా కర్తవ్యం” అని ఎక్స్ పోస్ట్‌లో విజయ్ తెలిపారు. గాయపడినవారు సత్వరం కోలుకోవాలని ఆకాంక్షించారు.
కరూర్ బహిరంగ సభ నిర్వహణ కోసం విధించిన కొన్ని నిబంధనలను ఆ పార్టీ ఉల్లంఘించిందని ఏడీజీపీ డేవిడ్సన్ దేవాశీర్వాదం చెప్పారు. తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాళ్లు విసరడం వల్ల తొక్కిసలాట జరిగినట్లు టీవీకే చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. సభాస్థలిని వేరొక చోటుకు మార్చుకోవాలని తాము చెప్పామని, అందుకు టీవీకే పార్టీ నేతలు అంగీకరించలేదని తెలిపారు. విజయ్ 5 గంటలకుపైగా ఆలస్యంగా సభకు వచ్చారని తెలిపారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం కరూర్‌లో పర్యటించారు. టీవీకే బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో మరణించినవారి కుటుంబ సభ్యులను, గాయపడినవారిని పరామర్శించారు. తమిళనాడు చరిత్రలో ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంత ఎక్కువ మంది ఎన్నడూ మరణించలేదన్నారు. ఇటువంటి విషాదం ఎన్నడూ జరగకూడదన్నారు. ప్రస్తుతం ఐసీయూలో 51 మంది చికిత్స పొందుతున్నారు.