Shashi Tharoor : కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత (Congress leader) శశి థరూర్ (Shashi Tharoor) తీవ్ర విచారం వ్యక్తంచేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఇలాంటి ఘటనలు మన వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నాయని అన్నారు.
ఇటీవల ఆర్సీబీ సంబురాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడాన్ని కూడా థరూర్ గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవ్వాలన్నారు. ప్రముఖులు నిర్వహించే అన్ని రకాల కార్యక్రమాలకు కఠిన నియమాలను, భద్రతా ప్రొటోకాల్లను రూపొందించాలని సూచించారు.
మన దేశంలో జనసమూహ నిర్వహణను అమలు చేయడంలోనే ఏదో తప్పు జరుగుతోందని, అందువల్లే ప్రతి ఏడాది ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. సాధారణ ప్రజల భద్రత, ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలో ఇలాంటి సభలు, సమావేశాల నిర్వహణకు కఠిన నిబంధనలు రూపొందించాలని కోరారు.