Vijay Rupani : ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Vijay Rupani) అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. రాజ్‌కోట్‌లో ఆయన పార్థీవ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. దాంతో, గుజరాత్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయనకు నివాళులు అర్పించనుంది. అంతేకాదు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినం (State Mourning) పాటిస్తామని తెలిపింది సర్కార్.
ఈ సందర్భంగా రేపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను అవనతం చేస్తామని, ఆ రోజు ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టబోమని ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. జూన్ 12న జరిగిన ఎయిరిడింయా బోయింగ్ ఏ1 171 డ్రీమ్ లైనర్ ప్రమాదంలో విజయ్ రూపానీ కన్నుమూశారు. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనలో విమానంలోని 241 మంది అసువులు బాశారు.
ప్రమాద స్థలి నుంచి మృత దేహాల్ని సేకరించిన ఫోరెన్సిక్ బృందం ఆదివారం డీఎన్ఏ పరీక్షలు జరిపింది. రూపానీ డీఎన్ఏ మ్యాచ్ కావడంతో ఆయన కుటుంబసభ్యలుకు మృతదేహాన్ని అప్పగించారు. మరో 86 మందిని కూడా గుర్తించినట్టు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. బీజేపీకి చెందిన విజయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకూ గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు.