KS Ratnam | మొయినాబాద్, జూన్ 15 : దశాబ్ద కాలం నుంచి భూమిని సాగు చేసుకుని బతుకుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజల భూములను రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమంగా గుంజుకోవడం అన్యాయమని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం అన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికెపల్లి గ్రామ రెవెన్యూలోని 180 సర్వే నెంబర్లో గల 100 ఎకరాల భూమిని 50 మంది బడుగు బలహీన వర్గాల పేదలు సాగు చేసుకుంటున్న భూమిని సర్కార్ అక్రమంగా గుంజుకోవడాన్ని నిరసిస్తూ ఆదివారం ఆయన భూ బాధితులను కలిశారు. భూములకు సంబంధించిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1954 నుంచి రైతులు భూమిని సాగు చేసుకుంటూ భూమిశిస్తూ కడుతూ వచ్చారని గుర్తు చేశారు. భూమి శిస్తూ చెల్లించడంతో అప్పటి ప్రభుత్వం రైతులకు తోక పాసు బుక్కులు కూడా జారీ చేశారని తెలియజేశారు. రైతులు ఆ భూమిని నమ్ముకుని ఆధారపడుతూ 1983 వరకు భూమిశిస్తూ కడుతూ వచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం పేద రైతుల భూములను తీసుకొని గోశాలకు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కోకాపేటలోని గోశాల సంబంధించిన 100 ఎకరాల భూమిని తీసుకొని అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఆ భూమికి బదులుగా ఎనికేపల్లిలోని రైతులు సాగు చేసుకుంటున్న భూమిని ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని ఆయన మండిపడ్డారు. గోశాలకు ఇవ్వడానికి దళితులు, వెనుకబడిన తరగతుల వర్గాలకు సంబంధించిన భూములు మాత్రమే ఉన్నాయా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అప్పటి ప్రభుత్వాలు పేదలకు భూములు ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల నుంచి భూములు లాక్కోవడం చాలా అన్యాయమని మండిపడ్డారు. భూములు తీసుకోవాలనుకుంటే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇప్పటివరకు సాగులో ఉన్న రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూములను సాగు చేసుకుని బతుకుతున్న రైతులకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుందని దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర పరిపాలన చేయడం చేతకాకనే భూములు అమ్మి పరిపాలన కొనసాగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని మార్చుకొని పేదలు సాగు చేసుకుంటున్నా భూములను తీసుకోవాలని ఆలోచన ఉపసంహరించుకోవాలని సూచించారు. నాయకులు కంజర్ల ప్రకాష్, మాజీ సర్పంచ్ రాజు, నాయకులు పాల్గొన్నారు.