ఖైరతాబాద్, జూన్ 15 : గిరిజనుల ఓట్లతో గద్దెనెక్కి ఆ జాతికి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని తెలంగాణ ట్రైబల్ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు డాక్టర్ ఎన్. ధనుంజయ నాయక్ అన్నారు. లక్డికాపూల్లోని హోటల్ సెంట్రల్ కోర్టులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల మంత్రివర్గ విస్తరణ చేసి బంజారాలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. సేవాలాల్ జయంతి రోజున సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చింది బంజారాలేనని చెప్పారు. కానీ నేడు ఆ వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని, ఆ జాతి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఎస్టీ కమిషన్, తండాల అభివృద్ధి కోసం తండా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి తమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
ఈ సమావేశంలో మాజీ ఎంపి రవీంద్రనాయక్, బీఆర్ఎస్ నేత ప్రకాశ్ రాథోడ్, రిటైర్డ్ జేటిసి పాండురంగ నాయక్, డాక్టర్ వెంకటేశ్ చౌహాన్, డాక్టర్ రాజేశ్ నాయక్, రిటైర్డ్ సీఈవో బీమ్లా, సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరిచరన్. ప్రొఫెసర్ రెడ్యానాయక్, భీమా నాయక్, రిటైర్డ్ ట్రైబల్ కమిషనర్ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.