హైదరాబాద్, జూన్ 12 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) మృతి చెందారు. ఈ మేరకు కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ గురువారం వెల్లడించారు. ‘లండన్‌లోని కుటుంబ సభ్యులను కలువడానికి వెళ్తుండగా రూపానీ విమాన ప్రమాదంలో మరణించారు’ అని పాటిల్ అన్నారు. భార్య అంజలీ రూపానీని తీసుకురావడానికే విజయ్ రూపానీ లండన్‌కు ప్రయాణమయ్యారని ‘న్యూస్18’తో రూపానీ కుటుంబసభ్యులు తెలిపారు. రూపానీ మరణవార్త తెలియగానే రాజ్‌కోట్‌లోని ఆయన నివాసం ముందు స్థానికులు పెద్దయెత్తున గుమిగూడారు. ఆయన సేవలను గుర్తు చేసుకొన్నారు.
ప్రమాదానికి గురైన ఎయిరిండియా ఫ్లైట్ మ్యానిఫెస్టో ప్రకారం.. 12వ ప్యాసింజర్‌గా రూపానీ ఉన్నారు. బిజినెస్ క్యాటగిరీకి చెందిన జడ్-క్లాస్ టికెట్‌ను ఆయన బుక్ చేసుకొన్నా రు. కాగా గుజరాత్ సీఎంగా పనిచేసి విమాన ప్రమాదంలో మరణించిన రెండో సీఎంగా రూపానీ నిలిచారు. 60 ఏండ్ల కిందట 1965లో గుజరాత్ మాజీ సీఎం బలవంత్రాయ్ మెహతా కూడా ఇలాగే ఓ విమాన ప్రమాదంలో కన్నుమూశారు.
ఆగస్టు 2016 నుంచి సెప్టెంబర్ 2021 వరకూ గుజరాత్‌కు సీఎంగా రూపానీ రెండుమార్లు పనిచేశారు. అంతకుముందు వాటర్ సైప్లె, కార్మిక, రవాణాశాఖ మంత్రిగా, రాజ్యసభ ఎంపీగా, రాజ్‌కోట్‌కు మేయర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం పంజాబ్ బీజేపీ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రూపానీకి ఒక కుమారుడు రుషబ్, కుమార్తె రాధిక ఉన్నారు. గతంలో ఓ కారు ప్రమాదంలో చిన్న కుమారుడు పూజిత్ మరణించారు. కుమారుడికి గుర్తుగా చారిటీ పనుల కోసం పూజిత్ రూపానీ మెమోరియల్ ట్రస్ట్‌ను రూపానీ ఏర్పాటు చేశారు.