న్యూఢిల్లీ: హవాలా చట్టంలోని నిబంధనలను అడ్డం పెట్టుకొని నిందితులను దీర్ఘకాలం పాటు నిర్బంధంలో ఉంచుకొనే విధంగా ఈడీని అనుమతించరాదని సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానాలకు సూచించింది. బెయిల్ మంజూరు చేసే విషయంలో తమకున్న అధికారాలను వినియోగించాలని సూచించింది.
హవాలా చట్టంలోని నిబంధనలు ఈడీకి ఆయుధంగా మారకుండా చూసే బాధ్యత రాజ్యాంగ కోర్టుల (సుప్రీంకోర్టు, హైకోర్టు)దేనని స్పష్టంచేసింది. హవాలా చట్టం కింద ఓ నిందితుడిపై దర్యాప్తు.. పరిమితికి మించి దీర్ఘకాలంపాటు కొనసాగుతున్నప్పుడు, బెయిల్ మంజూరుచేసే విషయంలో రాజ్యాంగ కోర్టులు తమకున్న విచక్షణాధికారాన్ని వినియోగించాలని సూచించింది. డీఎంకే నేత, తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధించిన హవాలా కేసుపై విచారణ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.