న్యూఢిల్లీ, అక్టోబర్ 7: దీపావళి కానుక అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 20 నుంచి అమలులోకి రాగా ఇప్పటికీ వాటి సంపూర్ణ ఫలితాలు ప్రజలకు దక్కడం లేదు. భారతీయ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలనే మార్చేస్తుందని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు 2.0 ఆచరణలో మాత్రం నత్త నడకను తలపిస్తున్నాయి. జీఎస్టీ రేట్లు 5 శాతం, 18 శాతానికి తగ్గించడం వల్ల నిత్యావసర వస్తువులు, మందుల ధరలతోసహా అనేక వస్తువుల ధరలు తగ్గిపోయి వినియోగదారులకు భారీ ఊరట లభిస్తుందని ప్రభుత్వం ఊదరగొట్టింది. యువత ప్రమేయం అధికంగా ఉండే రంగాలైన ఆటోమొబైల్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార తయారీ, టెక్నాలజీ వంటి రంగాలలోజీఎస్టీ సంస్కరణల కారణంగా ఖర్చులు బాగా తగ్గి పోటీ తత్వాన్ని పెంచి సృజనకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రజలు ఆశించారు. అయితే తాజాగా లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైన వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. కొత్త జీఎస్టీ రేట్ల ద్వారా చేకూరాల్సిన ప్రయోజనాలు ప్రజలకు అందడం లేదని తాజా సర్వే వెల్లడించింది.
అంచనాలకు, వాస్తవానికి తేడా
దేశవ్యాప్తంగా 341 జిల్లాలలోని 74,000 మంది వినియోగదారుల నుంచి స్పందనలను సర్వే సేకరించింది. ఇందులో 64 శాతం పురుషులు, 36 శాతం మహిళలు ఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిపోతాయని వినియోగదారులలో అత్యధికులు ఆశించారు. అయితే ప్యాకేజ్డ్ ఆహారం, మందుల విషయంలో ఇది అమలుకాలేదని వారు వెల్లడించారు. ప్యాకేజ్డ్ ఆహారానికి సంబంధించి కొత్త జీఎస్టీ రేట్ల పూర్తి ప్రయోజనాలు లభించినట్లు కేవలం 10 శాతం మంది వినియోగదారులు మాత్రమే చెప్పగా కొద్దిపాటి ఊరట లభించినట్లు 21 శాతం మంది తెలిపారు.
తమకు ఒక్కపైసా ప్రయోజనం లభించలేదని అత్యధికంగా 47 శాతం చెప్పడం అంచనాలకు, వాస్తవానికి మధ్య ఎంత తేడా ఉంటుందో బయటపెట్టింది. మందుల విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయి ప్రయోజనం లభించినట్లు కేవలం 10 శాతం మంది వినియోగదారులే చెప్పగా పాక్షిక ఊరట లభించినట్లు 24 శాతం మంది తెలిపారు. గతంలో ఉన్న ధరలే ఇప్పుడూ ఉన్నట్లు అత్యధికంగా 60 శాతం మంది వెల్లడించారు.
ఎలక్ట్రానిక్స్ కాస్త మెరుగు
ఆహారం, మందులతో పోలిస్తే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వస్తువుల్లో మారిన జీఎస్టీ రేట్ల అమలు కాస్త మెరుగ్గా ఉంది. ఈ వస్తువులపై పూర్తి జీఎస్టీ తగ్గింపును పొందినట్లు 34 శాతం మంది కస్టమర్లు తెలియచేయగా పాక్షిక ప్రయోజనాలు పొందినట్లు 33 శాతం మంది చెప్పారు. అయితే మొదటివారంతో పోలిస్తే రెండవ వారంలో పూర్తి, పాక్షిక ప్రయోజనాలు పొందిన వారి సంఖ్య 15 శాతం తగ్గడం గమనార్హం. ఒక్క ఆటోమొబైల్ రంగంలోనే జీఎస్టీ సంస్కరణలు ఆశించిన ప్రయోజనాలు అందచేసినట్లు సర్వేలో వెల్లడైంది.
తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రయోజనాలు తమకు సంపూర్ణంగా లభించినట్లు 76 శాతం మంది కార్ల కొనుగోలుదారులు చెప్పగా మరో 24 శాతం మంది మాత్రం పాక్షికంగా ప్రయోజనాలు లభించినట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇదే రంగంలో రెండవ వారంలో పూర్తి, పాక్షిక ప్రయోజనాలు పొందుతున్న వినియోగదారుల సంఖ్య 24 శాతం తగ్గడం జీఎస్టీ రేట్ల తగ్గుదల క్షేత్ర స్థాయిలో అమలు జరుగుతున్న తీరుకు అద్దం పడుతుంది.