పుణె: ముంబై-సోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం పుణె రైల్వే స్టేషన్‌కు సమీపిస్తున్న క్రమంలో రైల్లోని ఒక బోగీ పట్టాలు తప్పింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఈ రైలు ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి సోలాపూర్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ‘వందే భారత్ రైలులోని బోగీ వీల్స్‌లో ఒకటి డైమండ్ క్రాసింగ్ వద్ద పట్టాలు తప్పింది.
ఈ క్రాసింగ్‌ను యుద్ధ ప్రాతిపదికను మారుస్తున్నారు. ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు’ అని ఓ అధికారి తెలిపారు. ప్రమాదానికి గురైన కోచ్‌లోని ప్రయాణికులు తమ సామగ్రి తీసుకొని సమీపంలోని ప్లాట్‌ఫామ్ వైపునకు నడుచుకుంటూ వెళ్లిపోయారు. డైమండ్ క్రాసింగ్ అనేది ఒక రైల్వే జంక్షన్. ఇక్కడ రెండు ట్రాక్‌లు ఒకేస్థాయిలో ఒకదానికొకటి ఖండించుకుంటూ వజ్రాకారంలో ఏర్పడుతాయి.