Vande Bharat Sleeper | భారతీయ రైల్వే త్వరలోనే ప్రయాణికులకు శుభవార్తను చెప్పనున్నది. భారతీయ రైల్వే ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. సుదూర ప్రాంతాలకు రాత్రి సమయాల్లో ప్రయాణించేందుకు కొత్తగా వందే భారత్‌లో స్లీపర్ వర్షెన్‌ని ప్రవేశపెట్టబోతున్నది. త్వరలోనే ఈ రైలు పట్టాలెక్కబోతున్నది. ఇప్పటికే వివిధ మార్గాల్లో రైలు ట్రయన్ రన్ విజయవంతమైంది. రైలు రూట్‌పై బోర్డు కసరత్తు చేస్తున్నది. ఇదిలా ఉండగా.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 10 వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని ప్రణాళిక వేసింది.
ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. స్లీపర్ రైళ్లను తయారు చేసే బాధ్యతను BEML కంపెనీకి రైల్వేశాఖ అప్పగించింది. ఈ సంవత్సరం చివరినాటికి పట్టాలపై ఉంచే ప్రణాళిక ఉందని రైల్వేమంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, రైల్వేబోర్డు ఆమోదముద్ర వేయనున్నది. ఈ రైళ్లు సాంకేతికత, సౌకర్యాలపరంగా ప్రపంచస్థాయిలో ఉండాలని.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని మంత్రిత్వశాఖ భావిస్తున్నది.
అయితే, వందే భారత్ స్లీపర్ రూట్‌ని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. దేశంలోని అత్యంత రద్దీగా ఉండే సుదూర మార్గాల్లో నడిపేందుకు అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. న్యూఢిల్లీ-హౌరా, సీల్దా-న్యూఢిల్లీ, న్యూఢిల్లీ-పుణే, న్యూఢిల్లీ-ముంబై, న్యూఢిల్లీ-సికింద్రాబాద్ తదితర మార్గాల్లో నడిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది.
వందే భారత్ స్లీపర్ రైళ్లను బీఈఎంఎల్ (BEML), కైనెక్ట్ (Kinect) రైల్వే సొల్యూషన్స్ లిమిటెడ్, టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ బీహెచ్ఈఎల్ కన్సార్టియం వంటి మూడు పెద్ద కంపెనీలకు అప్పగించారు. మొత్తం ఈ కంపెనీలు 210 రైలు సెట్లను తయారు చేయనున్నాయి.
కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఎక్స్టీరియర్తో పాటు ఇంటీరియర్ ప్రయాణికులకు ప్రీమియం అనుభూతిని ఇవ్వనున్నాయి. ఈ రైళ్లు ఆస్టెనిటిక్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేస్తారు. అధునాతన క్రాష్-సేఫ్టీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రతి రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. మొత్తం 823 మంది ప్రయాణీకులకు సీటింగ్, స్లీపింగ్ ఏర్పాట్లు ఉంటాయి. కోచ్‌లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ఉంటాయి. అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే.. త్వరలో వందే భారత్ స్లీపర్ పట్టాలకెక్కనున్నాయి.