Vande Bharat train : కేరళ (Kerala) లో వందే భారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్ రైలు (Express train) కు తృటిలో ప్రమాదం తప్పింది. ట్రాక్‌పై ఓ ఆటో ఆగి ఉండడాన్ని గమనించిన లోకోపైలట్ (Loco pilot) అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. తిరువనంతపురం (Thiruvantapuram) లోని అకతుమురి హాల్ట్ స్టేషన్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది.
రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 10.10 గంటలకు వందేభారత్ రైలు అకతుమురి హాల్ట్ స్టేషన్‌ను దాటి వెళ్తుండగా రైల్వే ట్రాక్‌పై ఓ ఆటో బోల్తాపడి ఉండడాన్ని లోకో పైలట్ గుర్తించారు. వెంటనే అత్యవసర బ్రేకులు వేసి, రైలును ఆపేశారు. అయితే రైలు వేగంగా వెళ్తుండటంతో వెంటనే ఆగలేదు. బోల్తాపడిన ఆటోను కొన్ని మీటర్ల దూరం నెట్టుకెళ్లింది. అయితే ఆటోలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
లోకో పైలట్ అప్రమత్తంగా లేకపోయి ఉంటే రైలు పట్టాలు తప్పి ప్రమాదం జరిగేది. కాగా ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, స్థానిక పోలీసులు ఆటోను పట్టాలపై నుంచి తొలగించారు. ట్రాక్ భద్రతను పరిశీలించిన అనంతరం రాత్రి 11.15 గంటలకు రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. సుధి అనే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో తన ఆటోను పట్టాలపై బోల్తాపడేశాడు.
ఆ తర్వాత ఆటోను అక్కడి నుంచి తీయడం చేతగాక జారుకున్నాడు. అయితే ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సుధిని గుర్తించి అరెస్టు చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నారు.