Bomb Threats | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట పాఠశాలలకో, విమానాశ్రయాలకో, షాపింగ్ మాల్స్కో ఇలాంటి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. నిన్న బెంగళూరులోని మూడు కళాశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌లోని వడోదర (Vadodara), రాజ్‌కోట్ (Rajkot) ఎయిర్‌పోర్ట్స్ (airports)కు బాంబు బెదిరింపులు వచ్చాయి.
గుర్తు తెలియని వ్యక్తులు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కి ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. సీఐఎస్ఎఫ్ బలగాలకు శనివారం ఉదయం 11 గంటలకు ఈ మెయిల్ వచ్చింది. బెదిరింపు మెయిల్‌తో పోలీసులు, సీఐఎస్ఎఫ్ బలగాలు వెంటనే అప్రమత్తమై రెండు విమానాశ్రయాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులూ, పేలుడు పదార్థాలూ లభించలేదని అధికారులు వెల్లడించారు. దేశంలోని ఇతర విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చినట్లు వడోదర పోలీస్ కమిషనర్ నర్సింహా కోమర్ ధ్రువీకరించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ అభ్యర్థన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
కాగా, ఇలాంటి బెదిరింపులు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. కొన్ని నెలల క్రితం అహ్మదాబాద్, వడోదర, రాజ్‌కోట్ సహా దేశంలోని సుమారు 100 విమానాశ్రయాలపై బాంబులు వేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అన్ని ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Also Read..
Rahul Gandhi | పరువు నష్టం కేసు.. రాహుల్‌కు సమన్లు పంపిన పూణె కోర్టు
Nagarjuna Akkineni | నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు.. రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు
Donald Trump | ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయాలి.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ కీలక సూచన