న్యూఢిల్లీ/హైదరాబాద్, జనవరి 2: 15-18 ఏండ్ల వయస్సు వారికి సోమవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ పిల్లల వ్యాక్సినేషన్‌పై పలు సూచనలు చేశారు. పిల్లల కోసం ప్రత్యేకంగా టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ర్టాలకు సూచించారు. పిల్లలకు, పెద్దలకు ఒకే వ్యాక్సిన్ కేంద్రంలో టీకాలు వేస్తే వ్యాక్సిన్లు కలిసిపోవచ్చని పేర్కొన్నారు. పిల్లలకు కొవాగ్జిన్‌కు బదులు పొరపాటున వేరే టీకాలు వేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పిల్లలకు కేవలం కొవాగ్జిన్‌ను మాత్రమే వేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో 15-18 ఏండ్ల వయస్సున్నవారు దాదాపు 10 కోట్ల మంది ఉంటారని అంచనా. సోమవారం నుంచి పిల్లలకు టీకా వేయనున్న నేపథ్యంలో ఎక్స్పైరీ ముగిసి దవాఖానల్లో ఉన్న కొవాగ్జిన్ డోసులను భారత్ బయోటెక్ సంస్థ సొంత ఖర్చుతో రీప్లేస్ చేస్తున్నది. ఇప్పటికే, 6.35 లక్షల మంది పిల్లలు కొవిన్‌లో పేర్లు నమోదు చేసుకొన్నట్టు సమాచారం.
రాష్ట్రంలో ఏర్పాట్లు పూర్తి
రాష్ట్రంలో 15-18 ఏండ్ల మధ్యవయసున్న టీనేజర్లకు సోమవారం నుంచి వ్యాక్సిన్లు వేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. 2007 డిసెంబర్ 31లోపు పుట్టినవారు టీకాలు వేసుకునేందుకు అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా 15-18 ఏండ్లలోపు వారు 22,78,683 మంది ఉన్నట్టు ప్రాథమిక అంచనా. రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏహెచ్‌లు, జిల్లా దవాఖానలు, టీచింగ్ హాస్పిటళ్లలో ప్రత్యేకంగా సమయం కేటాయించి టీకాలు వేయనున్నారు. వారికోసం ప్రత్యేకంగా క్యూలైన్లు, వ్యాక్సినేటర్లను ఏర్పాటు చేశారు. టీకా వేసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా వయసును ధ్రువీకరించే ఐడీ ప్రూఫ్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్, పాస్‌పోర్ట్, బర్త్ సర్టిఫికెట్, దివ్యాంగులకు ఇచ్చే యూనిక్ డిసెబిలిటీ ఐడీ వంటివాటిలో ఏదో ఒకదానిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవేవీ లేనివారికి కాలేజీ ఐడీ కార్డు ఉన్నా టీకా వేయనున్నారు. జీహెచ్ఎంసీ సహా 13 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే టీకాలు వేయనున్నారు. దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రత్యక్ష విచారణను రెండు వారాల పాటు నిలిపివేసింది. వర్చువల్ పద్ధతిలో కేసులను విచారించనున్నది.
బెంగాల్లో విద్యాసంస్థలు బంద్
ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదివారం కఠినమైన ఆంక్షలను ప్రకటించింది. సోమవారం నుంచి అన్ని విద్యాసంస్థలు మూసే ఉంటాయని తెలిపింది. ఢిల్లీ, ముంబై నుంచి బెంగాల్‌కు వచ్చే విమానాలపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ సగం మంది ఉద్యోగులతోనే పనిచేస్తాయని అధికారులు తెలిపారు. రాత్రి పూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కేవలం నిత్యావసరాలు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లడానికి అనుమతి ఉంటుందన్నారు. ఈ నిబంధనలు ఈ నెల 15 వరకు అమల్లో ఉంటాయన్నారు. లోకల్ రైళ్లు కూడా సగం సామర్థ్యంతోనే నడుస్తాయని చెప్పారు. పర్యాటక ప్రదేశాలన్నీ మూసే ఉంటాయన్నారు. సోమవారం నుంచి 1-5 తరగతుల పిల్లలకు బడులను తెరవాలన్న నిర్ణయాన్ని ఒడిశా ప్రభుత్వం మానుకొన్నది.