తనక్‌పూర్, సెప్టెంబర్ 27: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న టీచర్ల డిమాండ్లను పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ టీచర్ల సంఘం సభ్యుడు రవి బగోటి ప్రధాని నరేంద్ర మోదీకి తన రక్తంతో లేఖ రాశారు. రాష్ట్రంలో టీచర్ల పెండింగ్ డిమాండ్లలో ప్రమోషన్లు, బదిలీలు, పాత పింఛన్ పథకం అమలు వంటివి ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది టీచర్లు గడచిన నెల రోజులకుపైగా నిరసనలు తెలియచేస్తున్నారని చంపావత్ జిల్లాలోని జెండాఖాలీలోని తనక్‌పూర్ ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్న రవి బగోటీ తన లేఖలో తెలిపారు. ఎన్నిసార్లు ఆందోళనలు నిర్వహించినప్పటికీ టీచర్లు లేవనెత్తిన దాదాపు 34 డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. విధి లేని పరిస్థితులలో తాను ఈ చర్యను చేపట్టినట్టు ప్రధానికి ఆయన తెలిపారు.