
డెహ్రాడూన్ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సరితా ఆర్యా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు.
ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమి సమక్షంలో సరితా ఆర్య సోమవారం డెహ్రాడూన్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మదన్ కౌశిక్ సహా పలు సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నైనిటాల్ స్దానం నుంచి పార్టీ టికెట్ కోరగా కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతోనే ఆమె కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు.
2017లో నైనిటాల్ నుంచి పోటీ చేసిన సరిత బీజేపీ అభ్యర్ధి సంజీవ్ ఆర్య చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే సంజీవ్ ప్రస్తుతం కాంగ్రెస్ పంచన చేరారు. ఇక ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.