UP Woman : భర్తపై యాసిడ్ దాడి చేసిన భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. అంతేకాదు.. ఆమెకు రూ.1.75 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని శంభల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కఖాన్షా అనే మహిళకు, ముజఫ్ఫర్ అనే వ్యక్తికి కొన్నేళ్లక్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే, భార్యాభర్తల మధ్య తరచూ విబేధాలు, వాగ్వాదం చోటు చేసుకునేవి.
ఇదే సమయంలో కఖాన్షాకు వేరొకరితో వివాహేతర సంబంధం కూడా ఉంది. దీంతో ఆమె భర్త నుంచి విడాకులు ఇవ్వాలని కూడా కోరుకుంది. అయితే, భర్తతో గొడవలు, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో గత ఏడాది మార్చి 7న అతడిని హత్య చేయాలనుకుంది. ఇందుకోసం ఇంట్లో నిద్రిస్తున్న భర్త ముజఫ్ఫర్పై యాసిడ్ పోసింది. ఈ దాడితో మేల్కొన్న ముజఫ్ఫర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయినా అతడి భార్య కఖాన్షా వదలకుండా మళ్లీ యాసిడ్ పోసింది. అది మీద పడటంతో ముజఫ్ఫర్ కంటి చూపు కోల్పోయాడు. అప్పుడు అక్కడి నుంచి తప్పించుకున్న భర్త.. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాడికి కారణమైన భార్య కఖాన్షాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై శంభల్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ విచారణ జరిపింది. కఖాన్షా నేరం చేసినట్లు రుజువైంది. దీంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం తుది తీర్పు వెల్లడించింది. జస్టిస్ గోపాల్ ఈ తీర్పు వెల్లడించారు. దీని ప్రకారం కఖాన్షాకు జీవిత ఖైదు విధించారు. అంతేకాదు.. రూ.1.75 లక్షల జరిమానా కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.