జైపూర్: ఒక కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు పలువురు వ్యక్తులను పెళ్లాడారు. (Sisters Marry Multiple Men) ఆ తర్వాత డబ్బు, నగలతో పారిపోయారు. వారి తండ్రితో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఒక మహిళను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. 2024 మేలో రాజస్థాన్‌లోని సికర్ జిల్లాకు చెందిన తారాచంద్ జాట్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన భగత్ సింగ్ కలిశాడు. తారాచంద్ ఇద్దరు కుమారులకు తన ఇద్దరు కుమార్తెలతో పెళ్లికి ప్రతిపాదించాడు. పెళ్లి ఖర్చుల కోసం రూ.11 లక్షలు తీసుకున్నాడు.
కాగా, 2024 మే 21 భగత్ సింగ్ తన భార్య సరోజ్, కుమారుడు సూరజ్, ఇద్దరు కుమార్తెలు
కాజల్, తమన్నాతో కలిసి అతిథి గృహానికి చేరుకున్నాడు. తారాచంద్ ఇద్దరు కుమారులైన భన్వర్‌లాల్, శంకర్‌లాల్‌తో తమ కుమార్తెలకు పెళ్లి జరిపించాడు. ఆ తర్వాత వారంతా రెండు రోజుల పాటు తారాచంద్ ఇంట్లో ఉన్నారు. మూడో రోజు ఆ ఇంట్లోని డబ్బు, నగలతో పారిపోయారు.
మరోవైపు ఈ విషయం తెలిసి షాక్ అయిన తారాచంద్ కుటుంబం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. డిసెంబర్ 18న భగత్ సింగ్, అతడి భార్యను అరెస్ట్ చేశారు. మోసపూరితంగా పెళ్లిళ్లు నిర్వహించే రాకెట్ నడుపుతున్నట్లు విచారణలో వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కూతురు తమన్నా, కుమారుడు సూరజ్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, భగత్ సింగ్ పెద్ద కుమార్తె కాజల్ నాటి నుంచి పరారీలో ఉన్నది. జైపూర్, మధురలో కొంతకాలం ఉన్న ఆమె గురుగ్రామ్ చేరుకున్నది. అక్కడ అద్దె ఇంట్లో కాజల్ నివసిస్తున్నట్లు సికర్ పోలీసులు తెలుసుకున్నారు. దీంతో గురుగ్రామ్ పోలీసుల సహాయంతో గురువారం ఆమెను అరెస్ట్ చేశారు.
మరోవైపు తండ్రి భగత్ సింగ్ పెళ్లిళ్ల పేరుతో వ్యవస్థీకృత మోసపూరిత నెట్వర్క్ ఏర్పాటు చేసినట్లు కాజల్ ఆరోపించింది. పలువురు వ్యక్తులను ఉత్తుత్తిగా పెళ్లి చేసుకుని వారిని మోసగించి డబ్బు, నగలతో పారిపోయినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మోసపోయిన బాధిత వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన మిగతా నిందితుల కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: పోలీసుల ముందే ప్రొఫెసర్ చెంపపై కొట్టిన విద్యార్థిని.. వీడియో వైరల్