హైదరాబాద్, జనవరి 30 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): సొంత పార్టీనే అధికారంలో ఉన్నది. అయితే ఏం లాభం? తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు తాగునీటి కష్టాలను ఆ ఎమ్మెల్యే తీర్చలేకపోయారు. ఇదే సమయంలో రాష్ట్ర జల్శక్తితశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆ ఊళ్లోకి వచ్చాడు. ఇదే సరైన సమయమని ఆ ఎమ్మెల్యే తమ సమస్యను మంత్రితో విన్నవించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, ఆ మంత్రి దాన్ని పెడచెవినపెట్టారు. దీంతో తిక్కరేగిన ఆ ఎమ్మెల్యే.. సదరు మంత్రిని నిర్బంధించి కలెక్టరేట్‌కు తీసుకెళ్లారు. అంతేకాదు.. తమ సొంత పార్టీ పాలనలోనే రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవని, తాగునీరు రావట్లేదంటూ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన ఈ ఘటన బీజేపీ వర్సెస్ బీజేపీగా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
యూపీలోని మహోబా జిల్లాలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర జల్‌శక్తి మంత్రి స్వతంత్రదేవ్ సింగ్ పాల్గొన్నారు. మంత్రి వస్తున్నారన్న సమాచారం తెలుసుకొన్న ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్ సింగ్ తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం అక్కడి నుంచి వెళ్తున్న మంత్రిని కలిసిన ఎమ్మెల్యే.. జల్‌జీవన్ మిషన్ కింద తన నియోజక వర్గంలోని గ్రామాలకు తాగునీరు రావట్లేదని ప్రస్తావించారు. ఇదే విషయమై ఆయా గ్రామాల సర్పంచ్‌లతో మాట్లాడి, సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఎమ్మెల్యే విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ మంత్రి అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నించారు.
ఈ పరిణామంతో కంగుతిన్న ఎమ్మెల్యే, ఆయన అనుచరుల సాయంతో మంత్రిని నిలువరించారు. అక్కడి నుంచి వెళ్లకుండా నిర్బంధించారు. దీంతో ఎమ్మెల్యే, మంత్రి అనుచరుల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. ఫలితంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రిని నిర్బంధించిన ఎమ్మెల్యే బృందం కలెక్టరేట్‌కు తీసుకెళ్లింది. అక్కడ కొంత సమయంపాటు మంత్రి, ఎమ్మెల్యే చర్చించుకొన్నారు. అనంతరం.. 20 రోజుల్లో గ్రామస్తుల సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. తాజా ఘటనపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ పాలనలో అన్నీ ట్రబుల్సే అని ఎద్దేవా చేస్తున్నారు.
రోడ్లు బాగాలేవు. తాగునీటి కష్టాలు నిత్యకృత్యంగా మారాయి. పైపుల లీకేజీ ఎక్కువగా ఉన్నది. నమామి గంగా యోజన ఎప్పుడో అటకెక్కింది. ఇలా యూపీలో అన్నీ సమస్యలే. వీటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడానికే మంత్రిని అడ్డుకొన్నాం. 20 రోజుల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని మంత్రి హామీనిఇచ్చారు. సమస్యలు పరిష్కరించకపోతే, పోరాటం కొనసాగిస్తాం.
– బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్ సింగ్, చర్ఖారీ నియోజకవర్గం, యూపీ.