లక్నో: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇకపై పత్రికలను తప్పనిసరిగా చదవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి తరం విద్యార్థులు ఎక్కువ కాలం మొబైల్, కంప్యూటర్లతో గడుపుతున్న క్రమంలో వారి స్క్రీన్ టైమింగ్‌ను తగ్గించి వారిలో పఠనాసక్తిని పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రాథమిక, విద్యార్థులు తప్పనిసరిగా పత్రికలను చదవాలని ఆదేశించిన ప్రభుత్వం, ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని కోసం పాఠశాల లైబ్రరీలో హిందీ, ఇంగ్లిష్ పేపర్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.
నిర్దేశిత సమయంలో వెళ్లి పత్రికల్లోని ఎడిటోరియల్, జాతీయ, అంతర్జాతీయ, క్రీడా వార్తలను విద్యార్థులు రొటేషన్ విధానంలో చదవాల్సి ఉంటుంది. అదే సమయంలో ‘వర్డ్ ఆఫ్ ద డే’ ఎక్సర్సైజ్ను కూడా నిర్వహిస్తారు. ఆ రోజు పత్రికల్లోని ఐదు కష్టమైన పదాలను ఎంపిక చేసి వాటిని నోటీస్బోర్డ్పై రాస్తారు. దీని ద్వారా విద్యార్థుల్లో పదజాలంపై పట్టు పెరుగుతుంది. పత్రికలు చదవడం ద్వారా విద్యార్థుల్లో జీకే, పదజాలం, విమర్శనాత్మక ఆలోచన, ఏకాగ్రత, సామాజిక చైతన్యం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.