లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేతలకు భంగపాటు ఎదురైంది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిని కలిసేందుకు ఆమె నివాసానికి వెళ్లారు. అయితే అపాయింట్మెంట్ లేకుండా వెళ్లడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని తిప్పిపంపారు. (Mayawati) కాంగ్రెస్ నాయకులు రాజేంద్ర పాల్ గౌతమ్, బారాబంకి ఎంపీ తనుజ్ పునియా కలిసి మంగళవారం లక్నోలోని మాయావతి ఇంటికి చేరుకున్నారు. భద్రతా సిబ్బంది ఈ విషయాన్ని ఆమెకు తెలియజేశారు. అయితే అపాయింట్మెంట్ లేకుండా నేరుగా వచ్చిన ఆ కాంగ్రెస్ నేతలను కలిసేందుకు మాయావతి సుముఖత చూపలేదు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది వారిని వెనక్కి పంపారు.
కాగా, రాహుల్ గాంధీ సందేశాన్ని తెలియజేయడానికే కాంగ్రెస్ దళిత నేతలు మాయావతిని కలిసేందుకు ప్రయత్నించారన్న వాదనలను వారు ఖండించారు. మాయావతి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని, ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యంపై ఆందోళన కారణంగానే కలిసేందుకు వచ్చామని తనుజ్ పునియా మీడియాతో అన్నారు.
మరోవైపు ఆ ఇద్దరు నేతల అనధికార పర్యటన విషయాన్ని పార్టీ పరిగణనలోకి తీసుకున్నదని కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జ్ అవినాష్ పాండే తెలిపారు. ‘పార్టీ తరపున వెళ్లిన అధికారిక ప్రతినిధి బృందం కాదు. పార్టీ ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది. అక్కడికి వెళ్లిన నాయకుల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది’ అన్నారు.