లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మండిపడ్డారు. (Adityanath Slams Mamata) మహా కుంభ్‌ను ‘మృత్యు వేడుక’గా పిలిచే వారు హోలీ రోజున తమ సొంత రాష్ట్రంలో చెలరేగిన మత ఘర్షణలను నివారించలేకపోయారని ఎద్దేవా చేశారు. జనవరి 29న ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మందికిపైగా మరణించడంపై మమతా బెనర్జీ పలు ఆరోపణలు చేశారు. అయితే మార్చి 14న హోలీ రోజున బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో హింస జరిగింది.
కాగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనిపై సోమవారం స్పందించారు. సీఎం మమతా బెనర్జీపై మండిపడ్డారు. ‘66 కోట్లకు పైగా భక్తులు పాల్గొన్న మహా కుంభమేళాను వారు అస్తవ్యస్తం అని పిలిచారు. ‘మృత్యు కుంభ్ (మరణ పండుగ)’ అని ముద్ర వేశారు. కానీ హోలీ సమయంలో వారి సొంత రాష్ట్రంలో శాంతిభద్రతలను కూడా నియంత్రించలేకపోయారు’ అని విమర్శించారు. వారి రాష్ట్రంలో పండుగ జరిగినప్పుడల్లా కర్ఫ్యూ విధిస్తారని, అయితే ఉత్తరప్రదేశ్‌లో హోలీని ఆనందంగా జరుపుకుంటారని, ఆ తర్వాత ‘జుమ్మా’ ప్రార్థనలు చేస్తారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.