న్యూఢిల్లీ, మే 9: భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలని అమెరికా ప్రయత్నిస్తున్నదంటూ రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌సింగ్ పన్నున్ హత్యకు తమ దేశంలో కుట్ర జరిగిందని, దాని వెనక భారత పౌరుల హస్తం ఉందని ఆరోపించిన అమెరికా అందుకు సంబంధించి ‘నమ్మదగిన సాక్ష్యాల’ను చూపలేదని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు.
భారత్‌లోని మతస్వేచ్ఛను ప్రస్తావిస్తూ భారతదేశ జాతీయ మనస్తత్వం, చరిత్రపై అమెరికాకు ఏ కోశానా అవగాహన లేదని విమర్శించారు. మతస్వేచ్ఛపై నిత్యం నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నదని, ఇది భారత్‌ను అగౌరపరచడమేనని మండిపడ్డారు. భారత అంతర్గత రాజకీయ పరిస్థితులను అస్థిరపరచడం, సార్వత్రిక ఎన్నికలను క్లిష్టతరం చేయడమే అమెరికా ఆరోపణల ముఖ్య ఉద్దేశమని ఆమె ఆరోపించారు.