Supreme Court | అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. ఆయన ప్రసంగంపై అలహాబాద్ హైకోర్టును సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. విశ్వహిందూ పరిషత్ లీగల్ సెల్ ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ శేఖర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. జ్యుడీషియల్ అకౌంటబిలిటీ అండ్ రిఫార్మ్స్ (CJAR) అనే సంస్థ సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు లేఖ రాసింది. హైకోర్టు జడ్జిపై అంతర్గత విచారణ జరపాలని సంస్థ కన్వీనర్ ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేశారు. ఆయన న్యాయనైతికత, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఓ వర్గాన్ని కించపరిచే పదాలను సైతం ఉపయోగించారని లేఖలో ప్రస్తావించారు. వ్యాఖ్యలతో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి పదవికి, న్యాయవ్యవస్థకు చెడ్డపేరు వచ్చిందన్నారు.
ఉమ్మడి పౌరస్మృతి (UCC)పై వీహెచ్పీ లీగల్ సెల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో జస్టిస్ శేఖర్ యాదవ్ పాల్గొన్నారు. మెజారిటీ ప్రజల ఆకాంక్షల మేరకు హిందుస్థాన్ నడుస్తుంది తప్పా.. నలుగరిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది.. హలాలా చేస్తాం.. ట్రిపుల్ తలాఖ్ ఇస్తాం.. అందుకు మా పర్సనల్ లా అంగీకరిస్తుందని అనలేరని.. ఆ హక్కులు ఇక్కడ పని చేయవంటూ వ్యాఖ్యానించారు. ఆయన తన ప్రసంగంలో కఠ్ముల్లా (మూఢ ముస్లిం) అనే పదాన్ని సైతం వాడారు. యూసీసీ అంటే అది వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్లకు సంబంధించిన విషయం కాదని.. దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం దీని గురించి మాట్లాడిందన్నారు. కఠ్ముల్లాలు అనే మాట అనడం సరైంది కాకపోవచ్చని.. కానీ, అనేందుకు తాను సంకోచించనన్నారు. ఎందుకంటే వారు దేశానికి ప్రమాదకరమని.. వ్యతిరేకమన్న ఆయన.. వారితో జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. న్యాయమూర్తిగా ఉన్న ఆయన.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడేంటని ప్రశ్నిస్తున్నారు.